తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
వాంకిడి: దశాబ్దాల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా ఇతరులపై అక్రమంగా పట్టా చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఖమాన గ్రామానికి చెందిన లోబడె విమలబాయి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమాన గ్రామానికి చెందిన అడ్డూరి హన్మయ్య పేరిట ఖమాన శివారులోని 285/అ2 సర్వే నంబరులో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. 1950 నుంచి ఖమాన గ్రామానికి చెందిన లోబడే విమలబాయి కుటుంబం సాగు చేస్తోంది. అట్టి భూమిని ఇటీవల అడ్డూరి హన్మయ్య తన కుమారులైన అడ్డూరి దేవయ్య, అడ్డూరి రమేష్, అడ్డూరి సురేష్ పేరున గిఫ్ట్ సెటిల్‌మెంట్ కింద పట్టా చేయించాడు. ఇట్టి విషయంపై కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసినా తహసీల్దార్ తమను పట్టించుకోకుండా అక్రమ పట్టా చేశారని, న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. బాధితురాలు లోబడె విమలాబాయి, ఆమె కూతురు లలిత పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు, బంధువులు గుంజుకున్నారు. దీనిపై తహసీల్దార్ కవితను వివరణ కోరగా నివేదికను ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో అఖిల తేలి గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హివ్రె సందీప్, మండల ఉపాధ్యక్షుడు బాలేష్, నాయకులు హివ్రె ప్రవీణ్, శంకర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.


