ప్లాంట్ సరే.. ఆక్సిజన్ ఏది?
సిర్పూర్(టీ): మండల కేంద్రంలోని ప్రభుత్వ సా మాజిక ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగమైంది. 2020లో కోవిడ్ బాధితుల కోసం సుమా రు రూ.60లక్షలతో ఏర్పాటు చేసి ప్లాంట్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. రెండేళ్ల తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ నుంచి రోగుల బెడ్ల వరకు పైపులైన్ వేసినా కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో అది నిరుపయోగంగానే దర్శనమిస్తోంది.
అత్యవసర వేళల్లో ఇబ్బందులు
నియోజకవర్గ కేంద్రమైన సిర్పూర్(టీ)లోని ప్రభు త్వ సామాజిక ఆస్పత్రికి నిత్యం సిర్పూర్(టీ), కౌ టాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల రోగులతో పాటు సమీప మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. ఆస్పత్రి లో ఆక్సిజన్ సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో వైద్యులు రోగులను 108 అంబులెన్స్‌ల్లో కాగజ్‌నగర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి లేదా ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలున్నా ఆక్సిజన్ లేక రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్‌ను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని పేద రోగులు కోరుతున్నారు.


