కర్షకుడికి ఎంత కష్టం!
ఇప్పటికే పత్తికి తీవ్ర నష్టం పలు చోట్ల నేలవాలిన వరి నష్టపోయిన జిల్లా రైతాంగం ప్రారంభం కాని కొనుగోళ్లు ఆందోళనలో అన్నదాతలు
కౌటాల: జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన పత్తి సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈసారి ఖరీఫ్‌లో రెండు నెలలు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పత్తి పంట దెబ్బతింది. చేన్లలో నీరు నిలిచి దిగుబడిపై ప్రభావం పడింది. దీనికి తోడు ఇటీవలి మోంథా తుపాన్ మరింత నష్టం కలిగించింది. గతేడాది పూత, కాత దశలో వ ర్షాలు కురవక పత్తి దిగుబడి రాలేదు. ఈసారి పూ త, కాత సమయంలో వర్షాలు పడడంతో ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. పత్తి మొదటి విడత సేకరణ సమయంలో తుపాన్‌తో కాయలు నల్లబడ్డా యి. పత్తి నేల రాలింది. వరి పంటకూ నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు పత్తితీత ప్రారంభించారు.
ఆందోళనలో రైతాంగం
జిల్లాలోని రైతులకు పత్తి పంట ప్రధానమైంది. జి ల్లా వ్యాప్తంగా 3.40 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. తక్కువకాలంలో రైతులను శ్రీమంతులను చేయడం లేదా భారీ నష్టాలు కలిగించి అప్పులపాలు చేయడం ఈ పంట ప్రత్యేకతగా చెప్పుకొంటారు. ప్రస్తుతం పత్తి సేకరణ దశలో ఉంది. దీంతో రైతులు మొదటిసారి పత్తి తీత ప్రారంభించడానికి కూలీల ఇళ్ల ఎదుట క్యూ కడుతున్నారు. కూలీల కొ రతతో పత్తి తీత ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మరో వైపు వరి రైతులు కోతలు ప్రారంభించారు. అకాల వర్షాలు కురిస్తే అప్పులే మిగులుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అతివృష్టి లేదా అనావృష్టితో ఏటా పంట నష్టపోవడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ఇటీవలి వర్షాలకు వరి పంట కూడా నేలవాలిందని, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంజేస్తున్నారు.


