పల్లెల్లో స్థానిక పండుగ! | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో స్థానిక పండుగ!

Sep 30 2025 7:55 AM | Updated on Sep 30 2025 7:55 AM

పల్లెల్లో స్థానిక పండుగ!

పల్లెల్లో స్థానిక పండుగ!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ.. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ పల్లెల్లో మొదలైన సందడి

ఆసిఫాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇప్పటికే అధికార యంత్రాంగం సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితా విడుదల చేయడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. ఏళ్లుగా పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చట్టప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంతో అనేక గ్రామాల్లో మహిళా అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు. జిల్లావ్యాప్తంగా 345 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

విడతల వారీగా ఎన్నికలు

జిల్లాలో 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ, 335 పంచాయతీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్‌ 23న తొలి విడత ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు అక్టోబర్‌ 31న, రెండో విడత నవంబర్‌ 4న, మూడో విడత నవంబర్‌ 8న పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ అనంతరం అదేరోజు గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్‌ 11న నిర్వహిస్తారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 8 జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా, రెండో విడతలో ఏడు మండలాల్లోని 7 జెడ్పీటీసీలు, 56 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇక పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో కొనసాగుతాయి. జిల్లాలోని ఐదు మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డుల్లో మొదటి విడతలో పోలింగ్‌ జరుగుతుంది. రెండో విడతలో ఆరు మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 992 వార్డులు, మూడో విడతలో నాలుగు మండలాల్లోని 108 గ్రామ పంచాయతీలు, 938 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

రిజర్వేషన్లతో అయోమయం

స్థానిక సంస్థల రిజర్వేషన్లతో జిల్లాలో ప్రముఖ నాయకులు అయోమయంలో పడ్డారు. అనుకూలమైన స్థానాల్లో పోటీ చేయాలని ఎదురుచూస్తున్న చాలామంది అంచనాలు తారుమారయ్యాయి. ఆసిఫాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానా న్ని గతంలో ఎస్టీ మహిళకు కేటాయించగా, తాజాగా బీసీ జనరల్‌కు కేటాయించారు. జిల్లాలోని బీసీ నాయకులకు రిజర్వేషన్లు కలిసి వచ్చినా జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు అనుకూలించడం లేదు. ఆసిఫాబాద్‌ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్‌ చేయడం జిల్లా కేంద్రంలోని స్థానిక నాయకులకు సమస్యగా మారింది. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆసిఫాబాద్‌ జెడ్పీటీసీ, ఎంపీపీగా ఎక్కువసార్లు గెలిచిన అరిగెల నాగేశ్వర్‌రావు, ఆయన సోదరుడు మల్లికార్జున్‌రావుకు స్థానికంగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. వీరు పొరుగు మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరిన కోనేరు కోనప్ప, ఆయన సోదురుడు కృష్ణారావుకు కూడా రిజర్వేషన్లు అనుకూలించడం లేదు. సి ర్పూర్‌(యూ), లింగాపూర్‌ జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్‌ కాగా, జైనూర్‌, తిర్యాణి, రెబ్బె న, కాగజ్‌నగర్‌, కౌటాల బీసీలకు కేటాయించా రు. పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌(టి) ఎస్సీ, ఆసిఫాబాద్‌, వాంకిడి, బెజ్జూర్‌, చింతలమానెపల్లి, దహెగాం ఎస్టీలకు కేటాయించడంతో స్థానిక నేతల అంచనాలు తప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement