
జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్‌లో ప్రారంభమయ్యే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తూ అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, ఇతర సామగ్రి జిల్లాలోకి సరఫరా కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పెండింగ్ కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. మట్కా, గంజాయి, పేకాట వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, డీసీఆర్‌బీ డీఎస్పీ విష్ణుమూర్తి, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.