
పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో రైతులకు యూరియా పకడ్బందీగా పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో గురువారం వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన పంట నష్టంపై సర్వే సక్రమంగా చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలు అందాయని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. త్వరలో జిల్లాకు వచ్చే యూరియా పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షించాలన్నారు. సమావేశంలో డీఏవో శ్రీనివాసరావు, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకట్, మనోహర్, మిలింద్‌కుమార్ పాల్గొన్నారు.
మెరుగైన సేవలకు వైద్యుల నియామకం
జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యుల నియామక ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. తెలంగాణ వైద్య వి ధాన పరిషత్ పరిధిలోని జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న 23 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్), ఎంబీబీఎస్ పోస్టుల భర్తీ కోసం గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించామని పేర్కొన్నారు. 15 మంది హాజరు కాగా, ఇద్దరు స్పెషలిస్టులు, 11 మంది ఎంబీబీఎస్ వైద్యులను ఎంపిక చేశామన్నారు.