పాతవారికే కిసాన్‌ సమ్మాన్‌ | - | Sakshi
Sakshi News home page

పాతవారికే కిసాన్‌ సమ్మాన్‌

Sep 12 2025 6:27 AM | Updated on Sep 12 2025 3:44 PM

Crop investment finance

పంట పెట్టుబడి ఆర్థిక చేయూత

కేంద్ర ప్రభుత్వ పంట పెట్టుబడి  సాయానికి కొత్త రైతులు దూరం 

ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య 

నమోదు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది.. 

మరోసారి అవకాశం ఇవ్వాలని వేడుకోలు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): వ్యవసాయాన్నే నమ్ముకుని పంటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాల పరిమితి లేకుండా రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థికసాయం అందిస్తోంది. 2019లో పథకాన్ని ప్రారంభించగా. ఆ సమయంలో నమోదైన రైతులకే పథకం వర్తిస్తోంది. ఆ తర్వాత పట్టా పాసుపుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరడం లేదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా భూమిని పొందిన వారు, ఇతరుల నుంచి భూమి కొనుగోలు చేసి కొత్త పట్టాలు పొందిన వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏటా వందల సంఖ్యలో కొత్త రైతులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పథకంలో చేర్చడం లేదు.

తగ్గుతున్న అర్హుల సంఖ్య..

2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు, విదేశాల్లో నివాసం ఉండే వారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ప్రారంభంలో భూపరిమితిని విధించి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా రూ.6వేల సాయాన్ని మూడు విడతల్లో అందించారు. ఏడాది గడిచాక భూ పరిమితిని తొలగించి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్కో రైతుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేసింది. పాత రైతులకే తప్ప కొత్తవారికి ఈ పథకంలో అవకాశం కల్పించడం లేదు. ఫలితంగా వేలాదిమంది కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి దూరమవుతున్నారు. కొత్తవారికి అవకాశం లేకపోవడంతో క్రమంగా అర్హుల సంఖ్య తగ్గిపోతోంది. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర పరిశీలనలో మరణించిన రైతుల పేర్లు తొలగింపు, భూముల అమ్మకాలు, కుటుంబ సభ్యుల పేరిట భూములను విరాసిత్‌ చేయడంతో రైతుల సంఖ్య తగ్గింది. ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరడం, ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు.. ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వివరాలు బహిర్గతం కావడంతో వారికీ పథకం నిలిపివేసింది. పథకం ప్రారంభంలో దాదాపు 68వేల మంది పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం అందగా, కొన్నినెలల క్రితం కేంద్రం విడుదల చేసిన 20వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో జిల్లాలో అర్హులైన రైతుల సంఖ్య 33,369కి తగ్గింది. ఆరేళ్లలో అర్హుల సంఖ్య సగానికి పడిపోయింది.

చిన్న, సన్నకారు రైతులకు మేలు

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు కలుగుతోంది. అయితే ఈ పథకంలో కొత్తగా పట్టా పాసుపుస్తకాలు అందుకున్న వారికి చోటు కల్పించకపోవడంతో వేలాది మంది ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 1,42,155 మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 33,369 మందికే కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతోంది. అర్హులు కూడా పెట్టుబడి కోసం అప్పులపై ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా(రైతుబంధు) పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతుల వివరాల నమోదుకు నిర్దిష్టమైన తేదీని నిర్ణయించాయి. అప్పటివరకు పట్టాలు పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పేర్లు నమోదు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త రైతును కూడా కిసాన్‌ సమ్మాన్‌లో చేర్చలేదు.

ఉత్తర్వులు వస్తే నమోదు చేస్తాం

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో కొత్తగా పట్టా పాస్‌పుస్తకాలు పొందిన రైతుల పేర్లను నమోదు చేసుకోవడం లేదు. గతంలో నమోదైన వారికి మాత్రమే ఏడాదికి రూ.6వేల నగదును మూడు విడతల్లో అందిస్తోంది. కొత్తగా పట్టాపాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వస్తే తప్పకుండా పేర్లు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement