యూరియా పంపిణీలో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

యూరియా పంపిణీలో ఇష్టారాజ్యం

Sep 12 2025 6:25 AM | Updated on Sep 12 2025 6:25 AM

యూరియా పంపిణీలో ఇష్టారాజ్యం

యూరియా పంపిణీలో ఇష్టారాజ్యం

● దొడ్డిదారిలో నాయకులకు బస్తాలు అప్పగింత ● సీఈవోను నిలదీసిన రైతులు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): యూరియా కోసం రైతులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. అధికారులు మాత్రం పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టోకెన్లు ఉన్నవారికి కాకుండా బస్తాలను దాచిఉంచి దొంగచాటున అధికార పార్టీ నాయకులకు అందించారని గురువారం రెబ్బెన పీఏసీఎస్‌ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ ఇన్‌చార్జి సీఈవో శేషారావును నిలదీశారు.

43 బస్తాలు తరలింపు

రెబ్బెన పీఏసీఎస్‌కు ఇటీవల లారీ లోడ్‌ యూరియా రాగా వ్యవసాయశాఖ అధి కారులు రైతులకు టోకెన్లు జారీ చేశారు. బస్తాలన్నింటినీ పంపిణీ చేయకుండా 43 బస్తాలు మిగిలించారు. రెండు రోజుల్లో మరో లోడ్‌ రానుందని, వాటితో కలిిపి ఈ 43 బస్తాలను అందిస్తామని అన్నదాతలకు చెప్పి పంపించారు. అయితే మండలానికి చెందిన అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పీఏసీఎస్‌ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి గోడౌన్‌లోని 43 యూరియా బస్తాలను గురువారం ఉదయ మే గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లారు. దానికి పీఏసీఎస్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించిట్లు తెలుస్తోంది. నలుగురు నాయకులు పది బస్తాల చొప్పున, మరో పార్టీ నాయకుడు 3 బస్తాలు తీసుకెళ్లారు. రోజుల తరబడి నిరీక్షిస్తున్న వారిని పక్కనపెట్టి నాయకులకు అందించడంపై పీఏసీఎస్‌ వద్ద రైతులు సీఈవోను నిలదీశారు. బస్తాలను తిరిగి తెప్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పీఏసీ ఎస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్‌ రైతులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు.

నాయకులపై పోలీసులకు ఫిర్యాదు

పీఏసీఎస్‌ గోడౌన్‌లో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను బెదిరించి తీసుకెళ్లిన నాయకులపై సీఈవో శేషారావు ఎస్సై చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం కార్యాలయం తెరవక ముందే అటెండర్‌ తిరుపతితోపాటు తనను మండలానికి చెందిన నలుగురు నాయకులు బస్తాలు ఇవ్వాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నాయకులు తీసుకెళ్లిన బస్తాల్లో 23 బస్తాలు పీవోఎస్‌లో ఎంట్రీ చేసినవి ఉండగా, మిగిలిన బస్తాలు ఎంట్రీ లేకుండానే బెదిరించి తీసుకెళ్లినట్లు తెలిపారు.

సక్రమంగా పంపిణీ చేయాలి

రైతులకు సక్రమంగా పంపిణీ చేయాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. రెబ్బెన పీఏసీఎస్‌ ఎదుట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పీఏసీఎస్‌ సిబ్బందిని బెదిరించి 43 బస్తాలు తీసుకెళ్లడం సిగ్గు చేటన్నారు. కలెక్టర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రంగు మహేశ్‌గౌడ్‌, నాయకులు పందిర్ల మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి సీఈవో శేషారావు సస్పెన్షన్‌

రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో ఇన్‌చార్జి సీఈవోగా పనిచేస్తున్న శేషారావును సస్పెండ్‌ చేస్తూ జిల్లా సహకార అధికారి రాథోడ్‌ బిక్కు ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎస్‌కు సరాఫరా అయిన యూరియా బస్తాల పంపిణీలో శేషారావు అలసత్వం ప్రదర్శించడంతోపాటు గోడౌన్‌లో నిల్వ ఉంచిన 43 యూరియా బస్తాలను పీవోఎస్‌ యంత్రంలో నమోదు చేయకుండానే గురువారం గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన ఫిర్యా దు మేరకు శేషారావును సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన స్థానంలో దహెగాం పీఏసీఎస్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.జీవన్‌కుమార్‌కు ఇన్‌చార్జి సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement