
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధిహామీ పథకం ఏపీవోలు, సెర్ప్ ఏపీఎంలు, హౌజింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో వసతుల కల్పన, మొక్కల పెంపకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎన్నికల సంబంధిత అంశాలు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖలవారీగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుని, లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వందశాతం ప్రారంభించాలన్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ లేకుండా గుంతలు పూడ్చాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టే చర్యల్లో భాగంగా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, మైనార్టీ సంక్షేమ అధికారి నదీం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.