
పంటల డిజిటల్ సర్వే
జిల్లాలోని 64 క్లస్టర్లలో 1,21,050 ఎకరాల్లో క్రాప్ సర్వే ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు ఈ నెల 1 నుంచి అక్టోబర్ 20 వరకు కార్యక్రమం
వాంకిడి(ఆసిఫాబాద్): పంటల వివరాలు ఇకపై పక్కాగా ఉండనున్నాయి. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైంది. ఏటా ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి పంట వివరాలు నమోదు చేస్తుంది. అధికారులు రైతులతో మాట్లాడి పంట వివరాలు సేకరిస్తుండగా, అందులో కచ్చితత్వం ఉండటం లేదు. పంట ఉత్పత్తులు అమ్మకానికి వచ్చే సమయంలో కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు తలెత్తేవి. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో క్లస్టర్ల వారీగా ఏఈవోలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఏఈవోలకు అందించింది. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఒక సర్వే నంబరులో ఏ పంట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారనేది కచ్చితమైన వివరాలు తెలియనున్నాయి.
క్లస్టర్‌కు రెండు వేల ఎకరాలు..
జిల్లాలో మొత్తం 70 క్లస్టర్లు ఉండగా 64 క్లస్టర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే చేయనున్నారు. ఒక్కొక్క వ్యవసాయ విస్తరణ అధికారి 2000 ఎకరాల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలి. మహిళా వ్యవసాయ విస్తరణ అధికారులుగా ఉన్న క్లస్టర్లలో 1800 ఎకరాలను సర్వే చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా 70 క్లస్టర్ల పరిధిలో మొత్తం 4.42 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. ప్రస్తుతం చేపడుతున్న డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా 1,21,050 ఎకరాలకు సంబంధించిన పంట వివరాలు నమోదు చేయనున్నారు. మిగిలిన పంట వివరాలను గతంలో మాదిరి సాధారణ సర్వే చేపడతారు. డిజిటల్ సర్వేతో పంట వివరాలు నమోదు చేస్తుండటంతో కచ్చితత్వం ఉండనుంది. పంట ఉత్పత్తులు క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
4.42 లక్షల ఎకరాల సాగుభూమి..
జిల్లాలో 4.42 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా రైతులు ఉండగా అత్యధికంగా పత్తి పంట పండిస్తున్నారు. 3.30 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుంది. వరి 56 వేల ఎకరాలు, కంది 36 వేల ఎకరాలు. మిగతా 23 వేల ఎకరాల్లో పెసర, కందులు, వేరుశనగ, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, మిర్చి, పండ్ల తోటలు, కూరగాయలు వంటి తదితర పంటలు సాగు చేస్తున్నారు.
గడువులోగా పూర్తి చేస్తాం
జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అక్టోబర్ 20 తేదీలోగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచనలు చేశాం. ఒక్కొక్క ఏఈవో 2000 ఎకరాల్లో పంట వివరాలు నమోదు చేస్తారు. డిజిటల్ సర్వేతో పంట ఉత్తత్తుల కచ్చితమైన వివరాలు తెలుస్తాయి.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి
అక్టోబర్ 20 వరకు గడువు..
పంట సాగులో కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే విధానాన్ని తీసుకువచ్చింది. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వివరాలు నమోదు చేయాలి. ఒక సర్వే నంబరులో ఎన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారో గుర్తించి వేర్వేరుగా సేకరిస్తారు. రైతు పేరు, సాగు చేస్తున్న పంట ఎన్ని ఎకరాల్లో ఉంది, రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, పంటకు సంబంధించిన ఫొటో వంటి వివరాలను ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ సర్వే అక్టోబర్ 20 లోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఏఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సర్వే అనంతరం వివరాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. తద్వారా వివరాల నమోదులో తప్పిదాలు ఉంటే రైతులు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సవరణల అనంతరం తుది జాబితాను ప్రదర్శిస్తారు. దీని ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తప్పనున్నాయి.