రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ వాసుదేవ్‌కు వినతిపత్రం అందించారు. ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సుమారు 4 నుంచి 6 నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవితబీమా సౌకర్యం రూ.5 లక్షలు కల్పిస్తామని ప్రభుత్వం మెమో జారీ చేసి డీపీవోలకు పంపించినా నేటికి అనేక జిల్లాల్లో అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులకు రూ.19వేల వేతనం చెల్లించాలని, అప్పటిలోగా జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 51ని సవరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమే శ్, దేవాజీ, వెంకటేశ్, శ్రీనివాస్, శంకర్, సత్తయ్య, అన్నాజీ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.