
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైనవిద్యతోపాటు రుచికరమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు పరిశీలించారు. వంట మనుషులతో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న మెనూ వివరాలు తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలు, నిత్యావసర వస్తువులు వినియోగించాలని సూచించారు. శుద్ధమైన తాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల స్థానంలో బోధించిన తీరును పరిశీలించారు. గణితం ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. పదో తరగతి ఇంగ్లిష్, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు.