ఆలోచించి అడుగేస్తే సైబర్‌ మోసాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలోచించి అడుగేస్తే సైబర్‌ మోసాలకు చెక్‌

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే సైబర్‌ మోసాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘పాజ్‌ ఫర్‌ సేఫ్టీ – థింక్‌, వెరిపై’ నిర్వహించే అవగాహన పోస్టర్లను సీపీ గురువారం విడుదల చేసి మాట్లాడారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, మెసేజ్‌లు, ఈ–మెయిల్స్‌, సోషల్‌ మీడియా లింక్‌లను నమ్మొద్దని, ఓటీపీ, పిన్‌, బ్యాంక్‌ ఖాతా, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పొద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సీపీ తెలిపారు. ఈకార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఫణీందర్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఖమ్మం – కోదాడ

విద్యుత్‌ లైన్‌ ఇంటర్‌ లింక్‌

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ అంతరాయాలను నియంత్రించేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి జిల్లాకు ఇంటర్‌ లింకింగ్‌ విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ఈమేరకు గురువారం ఖమ్మం, సూర్యాపేట ఎస్‌ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, పెరికేటి యాదగిరి కోదాడలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ట్రాన్స్‌కో అధికారులతో కలిసి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం, ఫీడర్ల లోడ్‌ పరిస్థితిని సమీక్షించారు. కోదాడ సబ్‌ స్టేషన్‌ నుంచి గతంలో తొలగించిన 50 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. వ్యవసాయ సీజన్‌ దృష్ట్యా నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ అందేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగులకు సూచించారు. ఇరు సర్కిళ్ల డివిజనల్‌ ఇంజనీర్లు, ట్రాన్స్‌కో ఇంజనీర్లు పాల్గొన్నారు.

లో ఓల్టేజీ సమస్య రావొద్దు

నేలకొండపల్లి: విద్యుత్‌ వినియోగం పెరుగుతున్నందున లో ఓల్టేజీ సమస్య రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఎస్‌ఈ శ్రీనివాసాచారి ఉద్యోగులకు సూచించారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు వద్ద సబ్‌స్టేషన్‌ను తనికీ చేసిన ఆయన సరఫరా, లోడ్‌పై ఆరా తీశాక సూచనలు చేశారు. డీఈఈ చింతమళ్ల నాగేశ్వరరావు, ఏఈ జి.రవి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో

పార్కింగ్‌ ఫీజు వద్దు

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే, కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణ నవంబర్‌ 12కు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోనూ పార్కింగ్‌ సమస్య ఉందని, పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్‌ వరకు వాహనాలను నిలిపే వసతి లేకపోవడంతో నిమ్స్‌లో పార్కింగ్‌ చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొంది. హైకోర్టులో న్యాయవాదులతో పాటు ఇతర అవసరాలకు వచ్చిన వారు కూడా పార్కింగ్‌ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఖమ్మం ఆస్పత్రి ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన రోగుల వాహనాల నుంచి అక్రమంగా పార్కింగ్‌ చార్జీలు, జరిమానా వసూలు చేస్తున్నారని సికింద్రాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన టి.నవీన్‌రాజుతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది అంబేద్కర్‌ వాదనలు వినిపిస్తూ.. పార్కింగ్‌ ఫీజు వసూలు, జరిమానా విధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఫీజులు వసూలు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ విచారణను వాయిదా వేశారు.

ఖమ్మం అధికారులను ఆదేశించిన హైకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement