ఇలాగైతే కొన్నట్టే..! | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే కొన్నట్టే..!

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

● నాణ్యత లేదని 2,500 క్వింటాళ్ల పెసలు తిరస్కరణ ● రెండు మార్కెట్లలో రైతులకు నాఫెడ్‌ షాక్‌ నాణ్యతగా ఉన్నా తిరస్కరించారు నిరీక్షించినా ఫలితం దక్కలేదు

● నాణ్యత లేదని 2,500 క్వింటాళ్ల పెసలు తిరస్కరణ ● రెండు మార్కెట్లలో రైతులకు నాఫెడ్‌ షాక్‌

12 ఎకరాల్లో పెసర సాగుచేస్తే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన 12 శాతం తేమ ఉన్నా అధికారులు నాణ్యత లేదని తిరస్కరించారు. నాలుగు రోజులుగా ఆశలు కల్పించి చివరకు మొండి చేయి చూపారు.

– రాయల నర్సింహారావు, రైతు, కొనిజర్ల

కేంద్రాలు పెట్టి ప్రయోజనం లేదు. ఒక్క రైతు నుంచి కూడా కొనలేదు. నాణ్యతగా ఉన్నా కొర్రీలు పెట్టడం రైతు వ్యతిరేక చర్య. మద్దతు ధరతో పెసలు కొనుగోలు చేస్తారని రోజులుగా నిరీక్షిస్తే చివరకు తిరస్కరించడం బాధాకరం.

– రాధాకృష్ణ, రైతు, కొణిజర్ల

ఖమ్మంవ్యవసాయం: కనీస మద్దతు ధర కోసం నిరీక్షించిన పెసర రైతులకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నాఫెడ్‌(నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) షాక్‌ ఇచ్చింది. ఖమ్మం, వైరా మార్కెట్లలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన 2,500 క్వింటాళ్ల పెసలు నాణ్యతగా లేవని తిరస్కరించింది. దీంతో మళ్లీ ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మార్కెట్‌లో తక్కువ ధర

కేంద్రం ఈ ఏడాది క్వింటా పెసలకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించగా.. ప్రైవేట్‌ మార్కెట్‌లో వ్యాపారులు రూ.5వేల నుంచి రూ.6 వేలకు మించి చెల్లించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వినతితో కేంద్రం నాఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ఆదేశించింది. ఈమేరకు ఖమ్మం జిల్లా వైరా మార్కెట్‌లో ఈనెల 5న, ఖమ్మం మార్కెట్‌లో 7న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మద్దతు ధర దక్కుతుందనే ఆశతో రెండు కేంద్రాలకు దాదాపు 2,500 క్వింటాళ్ల పెసలను తీసుకురాగా.. నాలుగైదు రోజులుగా మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ అధికారులు తేమశాతం, నాణ్యతను పరిశీలిస్తూ జాప్యం చేయడంతో బుధవారం ఖమ్మం మార్కెట్‌ గేట్లకు తాళం వేసి రైతులు ఆందోళన చేశారు.

మొత్తం పంట తిరస్కరణ

రైతుల ఆందోళన నేపథ్యాన గురువారం సూర్యాపేట, హైదరాబాద్‌కు చెందిన నాఫెడ్‌ సూపర్‌వైజర్లు జయంత్‌, సురేష్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మురళి ఖమ్మం, వైరాలో పెసల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి నాణ్యతను పరీక్షించారు. అయితే, గింజ పగిలిపోతోందని, నిబంధనల ప్రకారం లేదంటూ మొత్తం పంటను తిరస్కరిస్తూ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లనుండగా.. చివరకు శుక్రవారం ప్రైవేట్‌ మార్కెట్లోనే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement