‘గుర్తింపు’ సమరానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’ సమరానికి సిద్ధం

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

సాయంత్రం 6 గంటల తర్వాత లెక్కింపు, 17వ తేదీన ఫలితాలు రీజియన్‌లో ఎనిమిది బూత్‌ల ఏర్పాటు

ఖమ్మం మయూరిసెంటర్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దశాబ్ద కాలం తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ప్రధాన కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శుక్రవారం జరిగే పోలింగ్‌కు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, డిప్యూటీ ఎన్నికల అధికారి ఎం.కోటేశ్వర్లు ఆధ్వర్యాన అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయించారు. ఉద్యోగులకు పోలింగ్‌ ప్రక్రియ, ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. కాగా, ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోలు, ఆర్‌ఎం కార్యాలయ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించేలా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేశాయి.

ఎనిమిది బూత్‌లు

ఉమ్మడి జిల్లాలో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు శ్రామిక్‌లు కలిపి 1,791 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేలా డిపోకు ఒకటి చొప్పున ఏడు, ఆర్‌ఎం కార్యాలయంలో ఇంకొకటి కలిపి ఎనిమిది బూత్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం డిపో ఆవరణలోనే డిపో సిబ్బందితో పాటు ఆర్‌ఎం కార్యాలయ ఉద్యోగుల కోసం రెండు బూత్‌లు ఏర్పాటయ్యాయి. ఖమ్మం డిపోలో అత్యధికంగా 423 మంది ఓటర్లు ఉండగా.. ఆర్‌ఎం కార్యాలయంలో 29 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఖమ్మం తర్వాతి స్థానంలో భద్రాచలం డిపోలో 333 మంది ఓటర్లు ఉన్నారు

ఐదు గంటల నుంచే పోలింగ్‌..

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ఉదయం 5 గంటలకే మొదలవుతుంది. దీంతో తెల్లవారుజామున 4–30 గంటలకల్లా అధికారులు అంతా సిద్ధం చేస్తారు. సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ ముగిశాక, 5 – 10 నిమిషాల విరామం ఇచ్చి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. అయితే, ఫలితాన్ని మాత్రం వెల్లడించరు. శుక్రవారం విధుల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన సిబ్బందికి ఈనెల 14, 15వ తేదీల్లో ఓటు వేసే అవకాశం కల్పించి, అవి లెక్కించాక అన్నీ కలిపి 17వ తేదీన ఫలితం వెల్లడిస్తారు.

33 మంది ఉద్యోగులు

పోలింగ్‌ కోసం 33 మంది ఉద్యోగులకు విధులు కేటాయించారు. ఎనిమిది పోలింగ్‌ బూత్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 17 మంది పోలింగ్‌ ఆఫీసర్లను నియమించారు. అలాగే, అదనపు పోలింగ్‌ ఆఫీసర్లతో పాటు సామగ్రి పంపిణీ, సేకరణ, డేటా ఎంట్రీకి ఇంకొందరు విధులు నిర్వర్తిస్తారు. ఈమేరకు గురువారం సాయంత్రమే ఉద్యోగులు పోలింగ్‌ సామగ్రితో డిపోలకు చేరుకుని ఏర్పాట్లు చేశారు.

రెండేసి ఓట్లు

ఒక్కో ఓటరు రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి గుర్తింపు(క్లాజ్‌ – 3) సంఘం కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌(క్లాజ్‌–3), రీజియన్‌ స్థాయి గుర్తింపు(క్లాజ్‌ – 6) కోసం లేత ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పేపర్‌ కేటాయించారు. ఒక్కో బ్యాలెట్‌ పేపర్‌పై తొమ్మిది సంఘాలకు కేటాయించిన గుర్తులు ఉంటాయి.

నేడు ఉదయం 5 గంటలకు ఆర్‌టీసీ పోలింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement