జూన్‌తో పోలిస్తే జూలైలో
మరింత కిందకు...
ఆగస్టు, సెప్టెంబర్‌లో పెరిగిన
భూగర్భ జలాలు
గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే మాత్రం తక్కువే..
జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల ఆశాజనకంగా నమోదవుతోంది. ఈ ఏడాది జూన్, జూలైల్లో భూగర్భ జలాలు అడుగంటగా,
ఆ తర్వాత నుంచి పెరుగుదల కనిపిస్తోంది. ఏడాది జూన్‌లో 5.46 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. కానీ సెప్టెంబర్‌లో 3.56 మీటర్ల
వద్దకు చేరాయి. ఈమేరకు 1.9 మీటర్ల మేర పెరుగుదల ఉండడం విశేషం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక జూన్, జూలైల్లో భూగర్భ జలాల గణనీయంగా పడిపోయాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు 78.4 సెం.మీ. వర్షానికి బదులు 58.6 సెం.మీ. మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యాన భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్‌లో 5.46 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు, జూలైలో 5.82 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవిలో తగ్గుదల సహజమే అయినా వానాకాలంలో భూగర్భ జలాలు తగ్గడం ఎల్‌నినో పరిస్థితులకు అద్దం పట్టింది.
భూగర్భ జలశాఖ జిల్లాలో స్థితిగతులను నెలవారీగా పర్యవేక్షిస్తోంది. జిల్లాలోని 66 కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేంద్రాల్లో నమోదైన గణాంకాల ద్వారా ఈ వానాకాలంలో మొదటి సారి సెప్టెంబర్‌లో భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపించింది. ఆగస్టులో 5.02 మీటర్ల వద్ద నీరు ఉండగా.. సెప్టెంబర్‌లో 1.46 మీటర్ల పైకి చేరి 3.56 మీటర్ల వద్దే నీటి లభ్యత నమోదైంది. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌లో మాత్రం 2మీటర్ల వద్దే నీరు అందుబాటులో ఉండగా.. ఈసారి 1.56 మీటర్ల లోతుకు పడిపోయినా, ఎల్‌నినో పరిస్థితుల్లో ఇది ఆశాజనకమేనని చెప్పవచ్చు.
జిల్లాలో పంటల సాగు అవసరాల నిమిత్తం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా, మధిర, కల్లూరు సత్తుపల్లి తదితర ప్రాంతాలకు నీరు చేరింది. అలాగే, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు విడుదల చేయగా.. పాలేరు, ఖమ్మం తదితర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తూనే చెరువులు నింపారు. ఇదే సమయాన సెప్టెంబర్‌లో అల్పపీడనం కారణంగా సీజన్‌లోనే భారీ వర్షం కురిసింది. ఫలితంగా పాలేరు, వైరా వంటి భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఎక్కువ ప్రాంతాల్లో చెరువులు, రిజర్వాయర్ల నీటినే సాగుకు వినియోగిస్తూ, బోర్లు, బావులను తక్కువగా ఉపయోగించడంతో భూగర్భ జలాలు తగ్గలేదని భావిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ప్రధానంగా కల్లూరు మండలంలో 0.56 మీటర్ల లోతులోనే ఉన్నాయి. వైరా మండలంలో 0.57 మీటర్ల వద్ద లభ్యత ఉండగా... సత్తుపల్లి మండలంలో మాత్రం 9.55 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. మొత్తంగా 21 మండలాల్లో.. 17 మండలాల్లో సగటు నీటి మట్టం 5 మీటర్ల లోతు కంటే తక్కువగా.. నాలుగు మండలాల్లో 5 – 10 మీటర్ల లోతులో ఉంది. ఈ ఏడాది మేతో పోలిస్తే సెప్టెంబర్‌లో సగటున 2.11 మీటర్ల పెరుగుదల నమోదైంది. దీంతో రైతులకు పంటలపై ఆశలు సజీవంగా నిలిచాయి.
సీజన్ మొదట్లో
భూగర్భ జలాల ఊగిసలాట


