● ‘చేయూత’ పరిశీలనలో కీలక నిర్ణయం ● పునఃపరిశీలన బాధ్యత ఐదుగురు అధికారులకు..
ఖమ్మంమయూరిసెంటర్: అర్హులైన వారికి దసరా పండుగ నాటికి చేయూత పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. గత నెల 30వ తేదీతో దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసిన అధికారులు అర్హుల జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. జిల్లాలో 27,766 దరఖాస్తులు అందగా, అందులో 25,455 ఆన్‌లైన్ చేశారు. ఇక ఆన్‌లైన్ కాని 2,311 దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పరిశీలించారు. మున్సిపల్, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేసినా... మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం ‘సూపర్ చెక్’కు ఆదేశాలు జారీ చేసింది.
క్షేత్రస్థాయి పరిశీలన
దరఖాస్తుదారుల్లో అర్హులు నష్టపోకుండా, అనర్హులకు పింఛన్ అందొద్దనే భావనతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు మున్సిపల్, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేఎంసీ పరిధిలో మాత్రం 150 దరఖాస్తుదారుల చిరునామా, సమాచారం లేక అధికారులు వెతికే పనిలో ఉన్నారు. రెండు రోజుల్లో వీటి పరిశీలన కూడా పూర్తయ్యే అవకాశముంది.
అక్రమాలకు తావులేకుండా..
మున్సిపల్, మండల స్థాయి అధికారులు చేసిన పరిశీలనలో ఏమైనా లోపాలున్నాయా.. అంతా సవ్యంగానే సాగిందా అనేది నిర్ధారించుకునేందుకు ప్రభుత్వం ‘సూపర్ చెక్’ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రత్యేక తనిఖీల కోసం జిల్లాలో ప్రతీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐదుగురు ఉన్నతాధికారులను ప్రభుత్వం కేటాయించింది. జిల్లాలో డీఆర్‌డీఓ, అడిషనల్ డీఆర్‌డీఓ, డీపీఓ, జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
10 శాతం చొప్పున..
నియోజకవర్గాల్లో అధికారులు పరిశీలించిన ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను ప్రత్యేక అధికారులు మరోమారు పరిశీలిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో 10 శాతం దరఖాస్తులను వీరు సూపర్ చెక్ చేయాల్సి ఉంది. రాష్ట్ర అధికారులు అందజేసిన జాబితాల ఆధారంగా పునఃపరిశీలించనున్నారు.


