రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
216మందికి రూ.1.02 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన ఖమ్మంరూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 216 మందికి రూ.1.02 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతీ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం కావొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి వేగంగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం ఆసరాగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


