దిగుబడి మొదలైన చోట నుంచి
ప్రారంభానికి సన్నాహాలు
జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణే లక్ష్యం
మిల్లర్లకు అప్పగించకుండా
గోదాముల్లో నిల్వ చేసేలా నిర్ణయం
గోదాములను గుర్తిస్తున్నాం..
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. నవంబర్ రెండో వారం నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ముందు నాట్లు వేసిన ప్రాంతాల్లో దిగుబడి మొదలైతే అక్కడ ఎప్పటికప్పుడు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. కల్లూరు మండలం బత్తులపల్లిలో ఐకేపీ ఆధ్వర్యాన తొలి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. జిల్లాలో 2.26 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగవడంతో 5.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో రైతుల అవసరాలు, వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసేది పోగా తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఎస్‌సీఎస్‌సీఎల్) ద్వారా మిగతా ధాన్యం సేకరణకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఉద్యోగులకు శిక్షణ
నవంబర్ రెండో వారం నుంచే ధాన్యం మార్కెట్‌కు పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయినప్పటికీ గత ఏడాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రాంతాలను పరిశీలించి ముందస్తు ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైన గన్నీ బ్యాగ్‌లు సమకూర్చుకోవడంతో పాటు తూకం, తేమ యంత్రాలను పరిశీలించనున్నారు. అలాగే, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి తేమ శాతం నిర్ధారణ, కాంటా వేయించడం, రవాణా చేయించడమే కాక ఆన్‌లైన్‌లో వివరాల నమోదుపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
ఏర్పాట్లు ఇలా..
కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. మొత్తం 9,750 టార్పాలిన్లకు గాను 13,210 అందుబాటులో ఉన్నాయి. అలాగే, 325 ప్యాడీ క్లీనర్లకు 286, 325 మొబైల్ గ్రెయిన్ డ్రైయర్లకు ఐదే ఉండగా మిగతావి సమకూర్చుకోనున్నారు. ఇక తేమ శాతం నిర్ధారించే యంత్రాలు 513, ఎలక్ట్రానిక్ కాంటాలు 366 ఉన్నాయి. నేలకొండపల్లి, కల్లూరు, మధిర, వైరా, సత్తుపల్లి మార్కెట్లకు ఐదు మొబైల్ గ్రెయిన్ డ్రైయర్లు సమకూర్చారు. కాగా, 69,85,675 గన్నీ బ్యాగ్‌లకు 23,51,000 మాత్రమే ఉండడంతో మిల్లర్ల వద్ద ఉన్న పాత గన్నీ బ్యాగ్‌లను తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.
గోదాములకు తరలించాకే మిల్లులకు...
ధాన్యం కొనుగోళ్లలో ఈసారి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో కేంద్రాల నుంచి నేరుగా మిల్లర్లకు తరలించేవారు. అక్కడ ధాన్యం మర ఆడించి సీఎంఆర్‌గా తీసుకునేవారు. అయితే, మిల్లర్ల వద్ద ధాన్యం పేరుకుపోయి సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఈసారి మిల్లులకు ధాన్యం కేటాయించకుండా గోదాంలకు తరలిస్తారు. ఆపై మిల్లర్లు సమర్పించే గ్యారంటీ పత్రాలు, ఇతర నిబంధనల మేరకు కేటాయించే అవకాశముంది. కాగా, జిల్లాలో ఇప్పటికే 1,05,510 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు సరిపడా స్థలాన్ని గుర్తించారు. మిగతా గోదాంలను ధాన్యం సేకరణకు అనుగుణంగా గురించనున్నారు. ఇక రవాణా కోసం జిల్లాలో ఎనిమిది క్లస్టర్లు ఏర్పాటుచేసి 320 వాహనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
శాఖల వారీగా ఏర్పాటుచేసే కేంద్రాలు
జిల్లాలో 325 కేంద్రాల ఏర్పాటు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈసారి మిల్లర్లకు నేరుగా ఇవ్వకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయనున్నాం. ఇందుకు సంబంధించిన స్థల లభ్యతపై వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే అక్కడ నిల్వ ఉన్న ధాన్యం ఫొటోలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం.
– చందన్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి


