కౌన్సెలింగ్‌ ద్వారా గురుకులాల్లో సీట్ల భర్తీ | - | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌ ద్వారా గురుకులాల్లో సీట్ల భర్తీ

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

భద్రాచలంటౌన్‌: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధి గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నామని రీజినల్‌ కోఆర్డినేటర్‌(ఆర్‌సీఓ) అరుణకుమారి తెలిపారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలిక పాఠశాలలో సోమవారం 5నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం చేపట్టిన కౌన్సెలింగ్‌ను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న 336 సీట్లను ప్రవేశపరీక్షలోని మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడ సీటు లభించినా విద్యార్థులు చేరాలని సూచించారు. వివిధ గురుకులాల పాఠశాలల ప్రిన్సిపాళ్లు మాధవీలత, చైతన్య, హరికృష్ణ, భద్రయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రియదర్శినిలో

‘శ్రీనివాస మంగాపురం’

ఖమ్మంరూరల్‌: త్వరలో విడుదల కానున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రబృందం సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడి చేసింది. నూతన హీరో ఘట్టమనేని జయకృష్ణ, దర్శకుడు అజయ్‌ భూపతి కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. చిత్ర విశేషాలను వివరిస్తూ సినిమా విజయవంతానికి సహకరించాలని కోరారు. కళాశాల చైర్మన్‌ కాటేపల్లి నవీన్‌బాబు మాట్లాడగా, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బత్తుల గోపాల్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ ఆట్లూరి వెంకటరమణ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, హీరో జయకృష్ణ కాలేజీ విద్యార్థులతో కలిసి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

ిసీపీఐ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నివాళి

ఖమ్మం మామిళ్లగూడెం: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన విద్యార్థుల ఆత్మశాంతి కోరుతూ ఖమ్మంలో సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద హేమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల పోరాట ఫలితంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని తెలిపారు. ఇంతటితో సరిపెట్టకుండా ఢిల్లీలో విద్యార్థులు, యువతపై లాఠీచార్జ్‌ చేసిన పోలీ సులపై విచారణ జరిపించాలని, విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ిసీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, మహ్మద్‌ సలాం, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, రావి శివరామకృష్ణ, చింతల రమేష్‌, మద్దోజు శ్రవణ్‌, ఇటికాల రామకృష్ణ, మడుపల్లి లక్ష్మణ్‌, మనోజ్‌, పుచ్చకాయల సుధాకర్‌, తాటి నిర్మల, సైదా, జ్వాలా నర్సింహారావు పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: చెల్లని చెక్కు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన జి.భానుకిరణ్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన రొంపిచర్ల సాయిసిద్ధార్థ్‌ వద్ద 2024 జనవరిలో భానుకిరణ్‌ రూ.25 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆపై అదే ఏడాది మే 3న రూ.25 లక్షలకు చెక్కు జారీ చేసిన ఆయన ఖాతాలో లావాదేవీలు నిలిపివేయడంతో తిరస్కరణకు గురైంది. దీంతో సాయిసిద్ధార్థ్‌ తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. సాక్షులను విచారించిన అనంతరం భానుకిరణ్‌కు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.29.50లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.

జర్మన్‌ భాషలో ఉచిత శిక్షణ

ఖమ్మం రాపర్తినగర్‌: నర్సింగ్‌, ఫిజియోథెరఫీ కోర్సులు పూర్తిచేసిన యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి మాధవి తెలిపారు. ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే జర్మనీ భాష అవసరం కావడంతో ఉచితంగా నేర్పించనున్నా మని వెల్లడించారు. త్వరలోనే టాంకామ్‌ ద్వారా శిక్షణ ఇచ్చి, పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి షరతులతో కూడిన ఎంపిక పత్రం అందజేస్తామని తెలిపారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement