సత్తుపల్లిటౌన్: అనంతపురం అనే ఊరిలో రాజేశ్ తల్లిదండ్రులతో జీవించేవాడు. రాజేశ్ పాఠశాలకు వెళ్లే దారిలోని గ్రంథాలయానికి ప్రతిరోజూ వెళ్లి కనీసం ఒక పుస్తకం చదివేవాడు. అలా దాదాపుగా గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివాడు. పుస్తకం చదివాక అందులోని వివరాలను తల్లితో చెప్పే రాజేశ్.. ఒక రోజు తానెంతో జ్ఞానం కలవాడినన్న అహంకారంతో మాట్లాడాడు. అప్పుడు వాళ్ల అమ్మ.. ‘కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి’అని అడిగింది. దీంతో రాజేశ్ ‘కురుక్షేత్ర సంగ్రామం అంటే ఏమిటమ్మా. నేను ఎన్నో పుస్తకాలు చదివినా దీని గురించి వినలేదు. నాకు వివరంగా చెప్పవా’అని అడిగాడు. అందుకు తల్లి ‘నేను ఇప్పుడు పనిలో ఉన్నాను.. తర్వాత చెబుతాను’అన్నది. రాజేశ్ మాత్రం ఆ పుస్తకం పేరైనా చెప్పాలని కోరాడు. దీంతో ఆమె భగవద్గీత అని చెప్పగానే గ్రంథాలయానికి వెళ్తే ఆ పుస్తకం దొరకలేదు. ఆపై నిరాశగా ఇంటికి వెళ్తున్న రాజేశ్‌కు దారిలో ఓ వృద్ధురాలు కన్పించింది. ఆమె ‘నాన్నా.. ఏదో ఆలోచిస్తున్నావు.. నీకు ఏమైనా కావాలా’అని అడిగింది. అప్పుడు రాజేశ్ ‘నాకు భగవద్గీత కావాలి’అన్నాడు. ఎందుకు అని అడిగితే కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంతో అర్జునుడు ఊదిన శంఖం పేరు ఏమిటని తన తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయానని పేర్కొన్నాడు. అప్పుడు ఆమె అర్జునుడు ఊదిన శంఖం పేరు దేవదత్తం అని చెప్పింది. అంతేకాక భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చింది. దీంతో రాజేశ్ సంతోషంగా ఇంటికి వెళ్లి తన తల్లికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆమె పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించగా.. పుస్తకం చదవడమే కాక అనుసరించడం మొదలు పెట్టాడు రాజేశ్. అంతేకాక తన అహంకారాన్ని విడిచిపెట్టి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.
–పాత్రాసాగర్, పదో తరగతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తుపల్లి
నేను చదివిన కథ


