నిర్దేశిత లక్ష్యంలో సగం కంటే తక్కువే
రైతులకు 90 శాతం చెల్లింపులు పూర్తి
కొనుగోళ్లు పూర్తయిన చోట
కేంద్రాలు మూసివేత
తీసుకొచ్చిన ధాన్యమంతా కొనుగోలు
జిల్లాలో 2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. ఈసారి 245 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవగా.. వాటి ద్వారా 17,600మంది రైతుల నుంచి 1,33,378 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 98శాతం మేర ధాన్యం మిల్లులకు ఽతరలించడమే కాక అందులో 90 శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈక్రమాన కొనుగోళ్లు పూర్తయిన 149 కొనుగోలు కేంద్రాలను మూసివేయడంతో యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ముగిసినట్లయింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
సగం కూడా రాలే...
యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,44,127 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 97,651 ఎకరాల్లో దొడ్డు రకం, 1,46,476 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేశారు. తద్వారా 2,76,626 మెట్రిక్ టన్నులు దొడ్డు బియ్యం, 3,55,662 సన్నరకం కలిపి 6,32,288 మె.టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మొత్తంలో రైతుల అవసరాలకు స్థానిక అవసరాలు, మిల్లర్లు కొనుగోలు చేసేవి పోగా కొనుగోలు కేంద్రాల ద్వారా దొడ్డు, సన్న ధాన్యం కలిపి 3,80,637 మె. టన్నులు సేకరించాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యంలో సగానికి కంటే తక్కువగానే కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు.
ఆటంకాల నడుమ మొదలై...
వరి ధాన్యం దిగుబడి ఎక్కువగా రావడంతో విక్రయానికి రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. మార్చి నెలాఖరు నుంచే జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా అరకొరగా ఉండడంతో అవస్థ ఎదురైంది. ఇదే సమయాన మిల్లర్లు షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో రైతులు అటే మొగ్గు చూపారు. మిల్లర్ల వద్ద చింట్లు రకం క్వింటాకు రూ.2,450, హెఎంటీ రకం ధాన్యం రూ.2,300 ధర చెల్లించారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరవడంతో ప్రభుత్వపరంగా కొనుగోళ్లు ఊపందుకున్నా అప్పటికే చాలా మంది మిల్లర్ల వద్ద అమ్ముకున్నారు. ఈ కారణంగానే లక్ష్యంలో సగానికి కంటే తక్కువగా ధాన్యం ప్రభుత్వ కేంద్రాలకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకా 1,065 మె.టన్నులే...
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 309 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినా.. డిమాండ్ ఆధారంగా పీఏసీఎస్, డీఆర్‌డీఏ, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యాన 245 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాలకు 1,35,512 మె.టన్నుల ధాన్యం రాగా.. ఇప్పటి వరకు 17,600 మంది రైతుల నుంచి 1,33,378 మె.టన్నులు కొనుగోలు చేసి అందులో 1,32,312.190 మె.టన్నులను మిల్లులకు తరలించారు. మరో 1,065.810 మె.టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రాల్లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
వేగంగా చెల్లింపులు
మొత్తం 17,600 మంది రైతుల నుంచి రూ.316,29,00,282 విలువైన 1,33,378 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 13,368మంది రైతుల ఖాతాల్లో రూ.253,19,46,498 నగదు జమ చేయడంతో 90శాతం చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 4,232 మందికి రూ.63,09,53,784 చెల్లించాల్సి ఉంది. కొనుగోళ్లు ముగిసి, ధాన్యం మిల్లులకు తరలించడం పూర్తయిన 149 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు.
జిల్లాలో 1,33,378 మె.టన్నుల ధాన్యం సేకరణ
కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తంగా 1,33,378 మెట్రిక్ టన్నులను సేకరించి గరిష్ట స్థాయిలో ధాన్యాన్ని మిల్లులకు కూడా తరలించాం. అంతేకాక రైతులకు 90శాతం చెల్లింపులు పూర్తయ్యాయి. కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలను దశలవారీగా మూసివేస్తున్నాం.
– సునీల్‌కుమార్, డీఎం, పౌర సరఫరాల సంస్థ


