ఖమ్మంక్రైం: పోలీస్ వాహనాల నిర్వహణ, మరమ్మతుల్లో వేగం పెరిగేలా పోలీసు కమిషనరేట్‌లోని ఎంటీ సెక్షన్ వర్క్‌షాప్‌లో హైడ్రాలిక్, ఎలక్ట్రో మెకానికల్ వెహికిల్ లిఫ్టర్‌ను ఏర్పాటుచేశారు. దీనిని సీపీ సునీల్‌దత్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ వాహనాల మరమ్మతు సమయాన గంటల తరబడి వేచిఉండకుండా త్వరగా పని పూర్తయ్యేలా ఈ లిఫ్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తద్వారా వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏఆర్ ఏసీపీలు సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్‌మీరా పాల్గొన్నారు.
గ్రంథాలయ శాఖలో ఉద్యోగుల బదిలీలు
ఖమ్మంగాంధీచౌక్: గ్రంథాలయ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురు లైబ్రేరియన్లు, ఒక వాచ్‌మెన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ శ్రీహరి పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లా కామేపల్లి లైబ్రేరియన్ లలితకుమారిని భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు, పండితాపురం నుంచి సీహెచ్.శ్రీనివాస్‌ను జూలూరుపాడుకు, ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి రవిబాబును కొత్తగూడెం జిల్లా గ్రంథాలయానికి బదిలీ చేశారు. అలాగే, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు లైబ్రేరియన్ ఎం.నవీన్‌కుమార్‌ను ఖమ్మం జిల్లా పండితాపురం లైబ్రేరియన్‌గా, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థలో వాచ్‌మెన్ శ్రీకాంత్‌ను ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిల్వ ఎరువులు
పాతధరతో విక్రయించాలి
ఖమ్మంవ్యవసాయం: ఎరువుల విక్రయాల్లో వ్యాపారులు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని పలు ఎరువులు, విత్తనాల, పురుగు మందుల షాపులు, గోదాములను ఏడీఏ కొంగల వెంకటేశ్వరరావు, ఏఓ కిషోర్‌బాబుతో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ పుల్లయ్య మాట్లాడుతూ ప్రస్తుతం స్టాక్ ఉన్న ఎరువులను పాత ఎంఆర్‌పీతోనే విక్రయించాలని, అలాకాకుండా కొత్త ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, విత్తన విక్రయాల్లో పారదర్శకత పాటించాలని, నిల్వలు, అమ్మకాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అంతేకాక సరైన వర్షాలు కురవకముందే విత్తనాలు నాటకుండా రైతులకు అవగాహన కల్పించాలని డీఏఓ తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ నుంచి రక్షణ
కారేపల్లి: ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ సూచించారు. కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ రామారావుతో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ఎక్కువ తాగునీరు తీసుకుంటూ, మధ్యాహ్నం ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు. అలాగే, సీజనల్‌గా లభించే పండ్లు తినాలని చెప్పారు. కాగా, పీహెచ్‌సీల్లో మందుల స్టాక్ అయిపోతుండగానే ఇండెంట్ పెడితే సరఫరా సులభమవుతుందని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సేవల్లో నిర్లక్ష్యం బయటపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవ్, కారేపల్లి మండల వైద్యాధికారి సురేష్ పాల్గొన్నారు.


