సాక్షిప్రతినిధి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారికి అనుకూలమైన ఓటర్లను జాబితాలో ఉంచి, మిగతా వారి పేర్లు తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతున్నందున, దీన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ పార్టీ బూత్‌స్థాయిలో సమర్థులైన ఏజెంట్లను నియమించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేసేలా జూన్ 30వరకు అన్ని స్థాయిల్లో కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. ఈక్రమాన పార్టీ కోసం అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామాల్లో నాయకులను సమన్వయపరచి తద్వారా పార్టీ అభివద్ధికి పాటుపడాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మధిర, వైరా, కల్లూరు మున్సిపల్ చైర్మన్లు ఎస్.సుజాత, కె.చంద్రకళ, మోహన్‌నాయక్, నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, డాక్టర్ కాపా మురళీకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్‌గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
నెహ్రూకు నివాళి
సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుతో ఆధునిక భారతదేశం నిర్మించాలని కలలు కనడమే కాక సాకారం చేసిన ఘనత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు దక్కుతుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. తొలి ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.


