మహిళలు సృష్టించిన అద్భుతం! | - | Sakshi
Sakshi News home page

మహిళలు సృష్టించిన అద్భుతం!

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

● మహిళా మార్ట్‌ ప్రారంభమై నేటికి ఏడాది ● రూ.కోటికి చేరువైన టర్నోవర్‌

133 మంది సభ్యులకు ఉపాధి

● మహిళా మార్ట్‌ ప్రారంభమై నేటికి ఏడాది ● రూ.కోటికి చేరువైన టర్నోవర్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెడితే అద్భుతాలు సృష్టిస్తారని జిల్లా మహిళా మార్ట్‌ నిరూపించింది. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాలనే సంకల్పంతో ఏర్పాటుచేసిన ఈ మార్ట్‌ ప్రారంభమై గురువారంతో ఏడాది పూర్తవుతోంది. పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టి.. ఏడాది కాలంలోనే దాదాపు రూ.కోటి టర్నోవర్‌ సాధించడం విశేషం. అంతేకాక మహిళామార్ట్‌ వద్ద టీస్టాల్‌ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ స్టాల్‌లో టీ విక్రయాల ద్వారా ఏడాది కాలంలో రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల సంపాదన లభించింది.

రూ.92.41లక్షల విలువైన అమ్మకాలు

సాధారణంగా కొత్తగా ప్రారంభించిన ఏ వ్యాపారమైనా మొదటి ఏడాది లాభాల బాట పట్టడం సులువు కాదు. కానీ ఖమ్మం మహిళా మార్ట్‌ ప్రతినిధులు తమ నిర్వహణా నైపుణ్యాలతో దూసుకెళ్తున్నారు. ఏడాది కాలంలో రూ.80,97,190.66 విలువైన వస్తువులను కొనుగోలు చేయగా.. ఏకంగా రూ.92,41,052.13 అమ్మకాలు నమోదు చేశారు.

20 మండల సమాఖ్యల అండ!

ఈ మార్ట్‌ సాధించిన విజయ ప్రస్థానం వెనుక జిల్లాలోని 20 మండల సమాఖ్యల సహకారం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక అమ్ముకోవడంలో అవస్థలు ఎదుర్కొన్నారు. ఒకవేళ అమ్ముకున్నా సరైన ధర లభించేది కాదు. ఈ నేపథ్యాన ఏర్పాటైన మహిళా మార్ట్‌ సభ్యుల ఇక్కట్లను తీర్చింది. క్షేత్రస్థాయి నుంచి వస్తువుల సేకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలన, ఆపై ప్రత్యేక బ్రాండ్‌తో అమ్మకం.. ఇలా ప్రతీ అంశంలోనూ మండల సమాఖ్యలు అండగా నిలవడం మార్ట్‌ విజయానికి కారణాలుగా నిలిచాయి.

స్థానిక మహిళల నైపుణ్యానికి ఈ మార్ట్‌ ఒక వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా దాదాపు 133 మంది మహిళా సంఘాల సభ్యులు ఈ మార్ట్‌కు నేరుగా తాము రూపొందించిన వస్తువులను సరఫరా చేస్తున్నారు. ఆయా ఉత్పత్తులకు ఇక్కడ సరైన మద్దతు ధర లభిస్తుండటంతో వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నిండుతున్నాయి. మరోపక్క వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు లభిస్తుండడంతో నానాటికీ ఆదరణ పెరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement