నేలకొండపల్లి: ఇటీవల పలు ప్రాంతాల్లో చేపల వేట కోసం చెరువుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వానాకాలం సీజన్‌లో సాగుకు ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యాన జల వనరుల శాఖ అధికారులు చెరువుల వద్ద రాత్రి వేళ గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి, చెరువుమాధారం, మండ్రాజుపల్లి తదితర చెరువుల వద్ద లష్కర్లకు వంతుల వారీగా గస్తీ విధులు కేటాయించారు. అంతేకాక వీరు విధులు నిర్వర్తిస్తున్నారా, లేదా అని పరిశీలించేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
నీరు వదిలితే చర్యలు
చేపల వేట కోసం చెరువు నుంచి నీటిని విడుదల చేస్తే చర్యలు తప్పవని జలవనరుల శాఖ నేలకొండపల్లి డీఈఈ మన్మథరావు హెచ్చరించారు. మండ్రాజుపల్లి, నేలకొండపల్లి కట్టలమ్మ చెరువుల నుంచి నీరు విడుదల చేశారనే ఫిర్యాదుతో బుధవారం ఆయన పరిశీలించి యూటీలను మూసివేయించారు. అనంతరం డీఈఈ మాట్లాడుతూ.. అక్రమంగా నీటిని విడుదల చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో మత్స్య సొసైటీ పాలకవర్గాలు, రైతులు కూడా పర్యవేక్షించాలని సూచించారు. కాగా, నీటి విడుదలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నీటిని విడుదల చేయకుండా సొసైటీ పాలకవర్గాల సభ్యులకు సూచనలు చేయాలని మత్స్య శాఖా అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయన వెంట జేఈలు నరేశ్, మదీన, సిబ్బంది పాల్గొన్నారు.
నీరు విడుదల చేయకుండా పహారా


