● జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు ● చిరు జల్లులతో వాతావరణంలో మార్పు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రోజుల తరబడి భరించలేని వేడి.. మరోవైపు ఉక్కపోత, వడగాలులతో విలవిల్లాడిన జిల్లా ప్రజలకు బుధవారం కొంతమేర ఉపశమనం కలిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో చిరు జల్లులు కురిశాయి. దీంతో బుధవారం ఉదయం ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత ఉక్కపోత యథావిధిగా కొనసాగినా ఎండ ప్రభావం తక్కువగానే నమోదైంది. ఇన్నాళ్లు 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కాగా, బుధవారం తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో నమోదైన 42 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టం కావడం గమనార్హం. జిల్లాలోని 24 వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీలకు పైగా, 18 ప్రాంతాల్లో 40 డిగ్రీలు, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈమేరకు గౌరారంలో 41.9, ఏన్కూరులో 41,8, పల్లెగూడెంలో 41.7, కాకరవాయిలో 41.5, ఖానాపురం పీఎస్‌లో 41.3, వైరాలో 41.2, కల్లూరులో 41.1, గుబ్బగుర్తిలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


