మూర్తుల తరలింపు..
ఆలయ అభివృద్ధిలో భాగంగా మూర్తుల తరలింపు
నేడు మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపివేత
భద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చరిత్రలో ఆదివారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయంలో కళావాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నజీయర్ స్వామి శనివారం రాత్రి భద్రాచలం చేరుకున్నారు. కళావాహనకు సంబంధించి శనివారం అంకురార్పణ జరపగా, వైదిక పరమైన పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేయనున్నారు.
కళావాహన, జీర్ణోద్ధరణకు అనుమతి
ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని భద్రమహర్షి గుడి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, ఆళ్వార్‌లు, ఇతర ఉపాలయాలను తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గుడుల్లోని మూలమూర్తుల జీర్ణోద్ధరణకు ఆదివారం అంతరాలయంలోని మూలమూర్తుల అనుజ్ఞ(అనుమతి) తీసుకోనున్నారు. అనంతరం మూలమూర్తులను కలశాలలోకి ఆవాహనం చేసే కళావాహనను భక్తిశ్రద్ధలతో జరపనున్నారు. ఆ తర్వాత 72 మూర్తులను ఏక కాలంలో రంగనాయకుల గుట్టపై తాత్కాలికంగా నిర్మించిన బాలాలయానికి తరలించనున్నారు. శ్రీ లక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను ప్రధానాలయంలో ముఖమండపం వద్ద కొలువుదీర్చనున్నారు. వైదిక కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపేందుకు రాష్ట్రంలోని పలు ఆలయాల నుంచి 30 మంది రుత్విక్కులను భద్రాచలం పిలిపించనున్నారు. ఆలయంలో ఈ కార్యక్రమాన్ని జరిపే బాధ్యతలను కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులుకు అప్పగించారు. ఆలయ రిటైర్డ్ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు సూచనలను అందించనున్నారు. కాగా, ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈఓ దామోదర్‌రావు ప్రకటనలో తెలిపారు.
ఘనంగా అంకురార్పణ
కళావాహనకు ఆలయ అర్చకులు శనివారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మేళతాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ తీర్థె బిందెతో పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు అంకురార్పణకు అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఆ తర్వాత బేడా మండపంలో అర్చకులు, వేద పండితులు విష్ణు సహస్రనామార్చన జరిపారు. ఉపాలయాల్లోని మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.
భద్రగిరి ఆలయాన్ని తొలుత భక్త రామదాసు నిర్మించగా, కాలక్రమంలో అనేక మార్పులు జరిగాయి. 1960 తర్వాత గోపురం పనులు చేపట్టారు. తర్వాత మిథిలా స్టేడియం, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తాజాగా ఆలయంలో అభివృద్ధి పరంగా సమూల మార్పులు జరగనున్నాయి. ప్రధాన అంతరాలయం మినహా అన్ని చోట్ల మార్పులు జరగనున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు, ఆళ్వార్ల మూర్తుల తరలింపును వైదికపరంగా నిర్వహించనున్నారు.
నేడు భద్రగిరిలో ఆవిష్కృతం కానున్న మహా ఘట్టం


