ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఇందిరానగర్‌లోని పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ దంపతులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ వీవీ నర్సింహారావు, అర్చకులు కృష్ణకిషోర్, సిబ్బంది వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ పశువైద్య
దినోత్సవంలో
పలువురికి సన్మానం
ఖమ్మంవ్యవసాయం: ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని శనివారం జిల్లాలో నిర్వహించారు. ఈసారి ‘పశు వైద్యులు – ఆహార, ఆరోగ్య రక్షకులు’నినాదంతో నిర్వహించగా, ఖమ్మంలోని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో జిల్లా పశుసంవర్థక, పశువైద్యాధికారి డాక్టర్ బోడేపూడి పురంధర్ మాట్లాడారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్లు ఇవ్వడం, చికిత్స చేయడంలో వైద్యులు, సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ వేణుమనోహర్‌రావు, జగత్‌కుమార్‌రెడ్డి, కేవీ నారాయణ, ఆర్.శ్రీనివాసరావు, ఏనుగు భాను, పశువైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేశ్‌బాబును సన్మానించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రమణి, అరుణ, పండరి బాబు, కిషోర్, పశువైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతు హరీశ్, రాకేశ్‌కుమార్‌తో పాటు రఘుపతి, గంగాధర్, భువనేశ్, రాంజీ, జగ్గూలాల్, శ్రీనివాస్‌నాయక్, నాగమణి, స్వాతిలత, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామానికి చెందిన శీలం పృథ్వీ (25) శనివారం ద్విచక్రవాహనంపై సత్తుపల్లి వైపు వస్తున్నాడు. ఈ క్రమాన మండలంలోని రేజర్ల వద్ద ఆయన వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వ్యక్తి..
ఖమ్మంక్రైం: అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి (40)కి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఖమ్మం జిల్లాఆస్పత్రి ఆవరణలో శుక్రవారం రాత్రి సదరు వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. ఈ క్రమాన ఆయన మృతి చెందగా మృతదేహన్ని మార్చురీలో భద్రపరిచి కుటుంబీకుల వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు ఖమ్మం టూ టౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. కాగా, సదరు వ్యక్తి తన పేరు మల్లేశ్ అని మాత్రమే చెప్పాడని, ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
జామాయిల్ తోటలో
అగ్ని ప్రమాదం
రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడులో శనివారం జామాయిల్ (యూకలిప్టస్) తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు జామాయిల్ సాగు చేస్తుండగా, మధ్యాహ్నం అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అంతకంతకూ విస్తరించాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారి బి.కోదండరామిరెడ్డి ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే సుమారు రెండు ఎకరాల్లో చెట్లు కాలిపోగా రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది నరసింహారావు, సత్యనారాయణ, గోపీకృష్ణమాచారి, మోహన్ పాల్గొన్నారు.


