వరికి ‘తాలు’ కాటు.. | - | Sakshi
Sakshi News home page

వరికి ‘తాలు’ కాటు..

Mar 24 2026 7:00 AM | Updated on Mar 24 2026 7:00 AM

దిగుబడి రాకపోవడంతో అన్నదాతల ఆవేదన

నమ్మకంతో సాగుచేసి నష్టపోయామని వెల్లడి

తాలు కంకుల పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు, అధికారులు

సత్తుపల్లిరూరల్‌: నకిలీ వరి విత్తనాలతో నట్టేట మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం వరి వంగడాన్ని సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, గౌరిగూడెం, రేజర్లతో పాటు వేంసూరు మండలంలోని భీమవరానికి చెందిన రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా సాగు చేశారు. అయితే, కంపెనీనే నకిలీ విత్తనాలను సరఫరా చేసిందని, తద్వారా తాలు కంకులు రావడంతో నష్టపోయామని చెబుతున్నారు.

పెట్టుబడి కూడా రాక...

వరి విత్తనాలను 20 కేజీల ప్యాకెట్‌ రూ.1,300 చొప్పున కొనుగోలు చేశామని రైతులు చెబుతున్నారు. ఒక్కో రైతు ఐదు నుంచి పది ఎకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 విత్తనాలతో సాగు చేయగా ప్రస్తుతం పంట వయస్సు 130 రోజులు దాటింది. అయితే, కోతకు వచ్చినా కంకులు తాలు కావడంతో కోసే పరిస్థితి లేదని.. కూలీలకు డబ్బు చెల్లించడం తప్ప కనీసం పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి పెడితే, 50 – 70శాతానికిపైగా తాలు కుంకులు రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్‌ దుకాణం యజమాని శ్రీరామ సీడ్స్‌ కంపెనీకి చెందిన ఈ వంగడంతో మంచి దిగుబడి వస్తుందని చెప్పడంతో నమ్మిన తాము మోసపోయామని వెల్లడించారు. ఈ విషయమై డీలర్‌ దృష్టికి తీసుకెళ్లడమే కాక కంపెనీ యజమానులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈమేరకు కంపెనీపై అధికారులు చర్యలు తీసుకుని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

శాస్త్రవేత్తల పరిశీలన

సత్తుపల్లి మండలంలోని గౌరిగూడెం, సిద్ధారం, రేజర్లల్లో సాగు చేసిన శ్రీరామ అగ్రి జెనిటిక్స్‌ కంపెనీకి చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌–15048 వరి రకం పంటలో తాలు ఎక్కువగా వచ్చిందని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.సుచరితాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి.పావని, పీఎస్‌ఎం.ఫణిశ్రీ, వరంగల్‌ విత్తన ధ్రువీకరణ అధికారి టి.వేణుమాధవ్‌, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓ కె.ఆశాజ్యోతి సోమవారం పొలాలను పరిశీలించారు. పంటల నమూనాలను సేకరించగా, పరీక్షల అనంతరం వివరాలు వెల్లడవుతాయని వారు తెలిపారు. రైతులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రసాద్‌, గొర్ల సోమిరెడ్డి, దేవదాసు, సాలి దేవదాసు, మరీదు నాగేశ్వరరావు, లింగారెడ్డి, రామారావు, గొర్ల నాగిరెడ్డి, సోమిరెడ్డి, చింతల శివనాగిరెడ్డి, పుచ్చా వసంతరావు, ములకలపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement