తలంబ్రాలకు విశిష్టత..
బుకింగ్ కోసం
సంప్రదించాల్సిన నంబర్లు..
భద్రాచలం వెళ్లలేని వారి కోసం
ఆర్టీసీ చర్యలు
భక్తుల వద్దకు చేర్చేలా ప్రణాళికలు
ప్యాకెట్ ధర రూ.151గా ప్రకటన
రాములోరి తలంబ్రాలు..
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో ఈనెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కల్యాణ తలంబ్రాలను చేర్చేలా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ లాజిస్టిక్ సేవల ద్వారా ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు చేరుస్తారు. గతంలో మంచి ఆదరణ రావడంతో ఈసారి మరిన్ని తలంబ్రాల ప్యాకెట్లు పంపిణీ చేసేలా యా జమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందస్తుగానే తలంబ్రాల బుకింగ్‌ను ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ప్రారంభించింది.
8 వేల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యం..
ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో 8 వేల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యంగా ఆర్టీసీ కార్గో అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది 8,500 ప్యాకెట్లను రీజియన్‌లో బుక్ చేయగా.. రూ.12.83 లక్షలు ఆదాయం సంస్థకు లభించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో బుకింగ్‌ల కోసం ఆర్టీసీ కార్గో సేవలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి బుకింగ్‌లను ప్రారంభించారు.
భక్తుల నుంచి ఆదరణ..
శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే భక్తులు కోరుకున్న చోటే ప్యాకెట్లను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. 2022 ఏడాది నుంచి ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించగా.. రెండేళ్ల క్రితం వరకు ఒక్కో ప్యాకెట్ ధర రూ. 116లుగా ఉంది. అయితే గత రెండేళ్ల నుంచి ఆ ధరను రూ.151కి పెంచింది. అయినా తలంబ్రాల ప్రాధాన్యత దృష్ట్యా భక్తుల నుంచి ఆదరణ తగ్గకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్గో అధికారులు భావిస్తున్నారు.
నేరుగా లేదా ఆన్‌లైన్‌లో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడుడిపోల్లో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్ల నుంచి స్వామివారి తలంబ్రాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించారు. అంతేకాక www. tgsrtc. gov. in వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నా రు. తలంబ్రాలను బుక్ చేసుకున్న వారికి స్వామి వారి కల్యాణ అనంతరం ఇంటి వద్దకే తలంబ్రాలు చేరవేస్తామని తెలిపారు.
రాముల వారి ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే సాక్షాత్తు రాముల వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు ఈ తలంబ్రాలు చల్లే ఆనవాయితీ ఉంది. అలాగే తలంబ్రాలను ఇళ్లలో పెట్టుకుని చిన్న వారిని ఆశీర్వదిస్తూ వారి కోరికలను ఫలించాలని కోరుకుంటుంటారు. ఇలా అన్నిరకాలుగా ప్రాధాన్యత ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వీటి కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.
సెంటర్ సెల్ నంబర్
ఖమ్మం 91542 98583
మధిర, సత్తుపల్లి 91542 98585
కొత్తగూడెం, ఇల్లెందు 91542 98582
భద్రాచలం, మణుగూరు 91542 98586
కార్గోలో పంపిణీకి ఏర్పాట్లు


