అర్హతలు,
నిబంధనలిలా..
2025 – 26 యాక్షన్ ప్లాన్ విడుదల
540 యూనిట్లకు
రూ.516.43 లక్షల సబ్సిడీ
రవాణా, వ్యవసాయ రంగాలకు
పెద్దపీట
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (టీజీఎస్సీసీడీసీ) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన మొత్తం 540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.516.43 లక్షల సబ్సిడీని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – ఖమ్మం మయూరిసెంటర్
రవాణా, వ్యవసాయ రంగాలకు పెద్దపీట
జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. 256 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 128 త్రీ వీలర్లను నిరుద్యోగ యువతకు అందించనున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 27 మంది ఎస్సీ రైతులకు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు మొత్తం 129 మంది యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, వారిని వేతన, స్వయం ఉపాధి వైపు మళ్లించనున్నారు.
24 వరకు దరఖాస్తు గడువు..
అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ ద్వారా ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రవాణా వాహనాలకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, సోలార్ పంప్‌సెట్ల కోసం కనీసం రెండెకరాల భూమి, పట్టాదార్ పాస్‌బుక్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపికై న వారికి శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏప్రిల్ 16 లోపు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసి యూసీలను అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
యూనిట్ ఆధారంగా సబ్సిడీ
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే స్వయం ఉపాధి, ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది. యూనిట్ ధర ప్రకారం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 90 శాతం, రూ.1,00,001 నుంచి రూ.2లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం, రూ.4,00,001 నుంచి రూ.5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పోను మిగిలిన యూనిట్ విలువను బ్యాంక్ రుణంగా ఇప్పించనుంది. ఉపాధి శిక్షణకు సంబంధించి యూనిట్ విలువకు పూర్తి సబ్సిడీ ఇవ్వనుంది.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని అర్హతలు, నిబంధనలు విధించింది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. గత ఐదేళ్లలో ఏదైనా ప్రభుత్వ ఉపాధి పథకం పొందిన వారు, దళిత బంధు లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కేటాయింపులో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రణాళిక ఖరారు చేసిన
ఎస్సీసీడీసీ అధికారులు


