కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Mar 23 2026 8:47 AM | Updated on Mar 23 2026 8:47 AM

ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం శ్రీవారి పాదాలకు అర్చకులు అష్టోత్తర కలశాభిషేకం చేశారు. ఆ తర్వాత సుప్రభాత సేవ నిర్వహించి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. వేదమంత్రాలతో మండపారాధన, నవగ్రహం హోమం గావించారు. అనంతరం గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. చివరగా శ్రీపద్మావతి అలివేలు మంగా సమేతుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని హంస వాహనంపై కొలువుదీర్చి భక్తుల కోలాటాల నడుమ ఆలయ గిరి ప్రదక్షణ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ సోమయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణప్రసాద్‌, ఉప ప్రధాన అర్చకులు, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు.

పెనుబల్లి యువకుడికి ‘విశ్వగురు’ అవార్డు

పెనుబల్లి: దక్షిణాఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో, రష్యాలోని మౌంట్‌ ఎల్బ్రూన్‌ వంటి శిఖరాలను విజయవంతంగా అధిరోహించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన పెనుబల్లికి చెందిన బర్మావత్‌ మోతీకుమార్‌ ‘విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ అవార్డు’ అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ సిటీ సీపీ శంఖబ్రతా బగ్చి, ఐఆర్‌ఎస్‌ అధికారి రవిశంకర్‌ మలిశెట్టి, సినీ నటుడు రాజీవ్‌ కనకాల, విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ ఫౌండర్‌ సత్యవోలు రాంబాబు తదితరులు ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా, మోతీకుమార్‌ అత్యున్నత ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆయన దాతలతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

యాప్‌తో విద్యుత్‌

ఉద్యోగుల భద్రత

ఖమ్మంవ్యవసాయం: క్షేత్ర స్థాయిలో విద్యుత్‌ ఉద్యోగుల భద్రత కోసం ఆన్‌లైన్‌ ఎల్‌సీ(లైన్‌ క్లియరెన్స్‌) యాప్‌ రూపొందించినట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఫీడర్ల ఎంపికలో లోపాలు, సమాచార లోపంతో ఉద్యోగులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు యాప్‌ రూపొందించినట్లు తెలిపారు. తద్వారా పని చేయాల్సిన ఫీడర్‌, పంపిణీ లైన్‌ వివరాలు స్పష్టంగా తెలుస్తాయని, ఎలాంటి పొరపాట్లు జరగకపోగా సిబ్బంది మధ్య సమాచార మార్పిడి సులువవుతుందని వెల్లడించారు.

అగ్నివీర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం రాపర్తినగర్‌: భారత సైన్యంలో నియామకాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని అధికారులు తెలిపారు. ఈమేరకు జిల్లాలో ఆసక్తి ఉన్న అవివాహిత యువత అగ్నివీర్‌ ద్వారా ఎంపికకు ఏప్రిల్‌ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయో పరిమితిని 21నుంచి 22ఏళ్లకు పెంచగా, అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌, ట్రేడ్స్‌మన్‌ పోస్టులకు ఎనిమిది నుంచి పదో తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో లేదా 040–27740059 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కాగా, నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement