● నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు ● అగ్నిప్రమాద బాధిత రైతులకు న్యాయం చేస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
మధిర/బోనకల్: దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యకోసం పెట్టే ప్రతీ రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా అబివర్ణించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
బీమా ప్రకారం సొమ్ము చెల్లించాలి..
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిర మండలం ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడుతూ.. శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం ఉన్న మిర్చికి సంబంధించిన రైతులకు బీమా ద్వారా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మధిర మార్కెట్‌లో కూడా మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
కళాశాల భవనాల పరిశీలన..
మధిర మండలం సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, ఐటీఐ భవనాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. నిర్మాణ పనుల పురోగతిపై ఆయన అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీఈ నాగేశ్వరచారి, ఏఈలు నాగేశ్వరావు, సురేష్, కాంట్రాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.


