మధిర: మధిర మండలంలోని ఆత్కూరు సమీపంలో ఉన్న శ్రీసాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు ఆదివారం అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగ వస్తూనే ఉంది. ఈ కోల్డ్‌స్టోరేజ్‌లోని ఆరవ అంతస్తులో ఈనెల 21న విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 350 మంది రైతులకు చెందిన 32 వేల మిర్చి బస్తాలు అంటే సుమారు 12,800 క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉంది. గతేడాది, ఈ ఏడాది పండిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 80 శాతం మంది ఆంధ్ర రైతులతో పాటు మధిర, బోనకల్, వైరా ప్రాంతానికి చెందిన మరి కొంతమంది రైతులు ఈ స్టోరేజ్‌లో నిల్వ చేశారు. కాగా, 2027 మార్చి వరకు స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించింది. ఈనెల 21 నుంచి నిరంతరాయంగా 9 ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈక్రమాన బాధిత రైతులు సుమారం 150 మంది ఘటనా స్థలానికి చేరుకుని బస్తాలకు సంబంధించిన రశీదులను అధికారులకు అందజేశారు.
స్ఫూర్తినింపిన అవయవాల దానం
●బ్రెయిన్‌డెడ్ వ్యక్తి లివర్, కిడ్నీలు దానం
ఖమ్మం రాపర్తినగర్: ఇంటి పెద్ద దిక్కు మరణించి పుట్టెడు దుఖం:లో ఉన్నా.. అవయదానం చేయడంతో కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఆవుల వెంకటరమణ (45) రోజువారిలాగే ఈ నెల 15న ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తూ కిందపడ్డాడు. చాలా సమయం తర్వాత గుర్తించిన స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి ఆపై హైదరాబాద్‌కు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి తలలో బ్లడ్‌క్లాట్ అయిందని గుర్తించారు. ఈక్రమంలో 18న ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. ఆ తర్వాత అవయవదానంపై జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ, ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయకర్తలు వివరించగా.. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. ఈక్రమంలో జీవన్‌ధాన్ ఆధ్వర్యాన అవసరం ఉన్నచోటుకు అవయవాలను తరలించనున్నట్లు తెలిపారు. కాగా, మృతుడు వెంటకరమణ నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుండడంతో పాటు ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావడంతో పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు.


