మళ్లీ కట్టెల పొయ్యి..! | Bhadrachalam Faces Gas Cylinder Shortage, Households And Hotels Struggle Amid Rising Prices | Sakshi
Sakshi News home page

మళ్లీ కట్టెల పొయ్యి..!

Mar 23 2026 10:57 AM | Updated on Mar 23 2026 11:11 AM

gas shortage hits villages and cities in telangana

భద్రాద్రి కొత్తగూడెం: గ్యాస్‌ కొరతతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గృహావసరాలకు గ్యాస్‌ కొరత లేదని అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే డెలివరీకి కనీసం పదిరోజుల సమయం పడుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్న 45 రోజుల తర్వాతనే గ్యాస్‌ తిరిగి బుక్‌ చేసుకోవాలని నిబంధనలు విధించారు. ఈలోగా గ్యాస్‌ అయిపోతే కట్టెల పొయ్యి వెలిగించాలి్సందే. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు మరింత కొరత ఏర్పడింది. కమర్షియల్‌ సిలిండర్లు దొరకకపోవటంతో కొన్ని హోటళ్లను మూసేశారు. కొందరు కట్టెల పొయ్యిలతో తంటాలు పడుతున్నారు.

వేధిస్తున్న కొరత
గ్యాస్‌ కొరతతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు అవసరాల కోసం గ్యాస్‌ను బుక్‌ చేసుకునేందుకు తొందరపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు.. వినియోగదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. గ్యాస్‌ కొరత కారణంగా పల్లె ప్రజలు మళ్లీ కట్టెల కోసం వెతుకుతున్నారు. పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ఎండిన చెట్లు, కొమ్మలను వంట చేసుకునేందుకు తెచ్చుకుంటున్నారు. కొందరు కూలీలు కట్టెలు తీసుకువచ్చి గ్రామాలు, పట్టణాల్లో అమ్ముతున్నారు. గతంలో కట్టెల మోపు రూ.200 ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. ఎడ్లబండ్లతో కట్టెలు తీసుకువస్తే రూ.2,500 నుంచి రూ.3,000 తీసుకుంటున్నారు.

భారంగా హోటళ్ల నిర్వహణ
ప్రస్తుతం వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ భారంగా మారింది. టిఫిన్‌ సెంటర్లు, భోజన హోటళ్లు గ్యాస్‌ కొరతతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. సిలిండర్లు దొరకక కొందరు హోటళ్లను బంద్‌ చేసుకుంటున్నారు. కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లపై కూలీలతో కట్టెలు తెప్పించుకుని వంట చేస్తున్నారు. పోడుసాగుతో అడవుల విస్తీర్ణం తగ్గిపోవటంతో కట్టెలకు కూడా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. కట్టెల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావటంతో రేటు బాగా పెరిగిపోతోంది.

 హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెలతో చేసిన వంటల ఖర్చు గ్యాస్‌తో చేసిన ఖర్చును మించిపోతుండటంతో ధరలూ పెంచేశారు. గతంలో ఉన్న ధరలకు అదనంగా 30 శాతం ధరలను పెంచి టిఫిన్లు, భోజనం విక్రయిస్తున్నారు. పట్టణాల్లో కర్రీ పాయింట్లు కూడా గ్యాస్‌ కొరతతో మూతపడుతున్నాయి. కొన్ని కర్రీ పాయింట్లలో ధరలను రెట్టింపు చేశారు. టీ, కాఫీ సెంటర్లపై కూడా గ్యాస్‌ కొరత ప్రభావం చూపింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న టీని రూ.15 చేశారు. రూ.20 ఉన్న కాఫీని రూ.25 చేశారు. స్వీట్లు తయారు చేసే నిర్వాహకులు కూడా గ్యాస్‌ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కంటే తక్కువగా తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోవటంతో స్వీట్లు, తినుబండారాల రేట్లను పెంచుతున్నారు.

ప్రత్యామ్నాయం ఏమిటో?
గతంలో వరిపొట్టు, బొగ్గుతో పొయ్యిలను ఏర్పాటు చేసుకుని హోటళ్లు నడిపేవారు. పొట్టు, బొగ్గు ధరలు బాగా పెరగటంతో అందరు గ్యాస్‌పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఆహార సంబంధిత వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ కొరత పెద్దగా ఏమీ లేదని, దానివల్ల ఇబ్బందులు ఏమీ లేవని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్‌ సిలిండర్లకు ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ కొరత ఎంతకాలముంటుందో, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలను చూపుతుందో వేచిచూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement