రామదాసు మందిరంలో నవమి వేడుకలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రామదాసు మందిరంలో నవమి వేడుకలు ప్రారంభం

Mar 24 2026 7:00 AM | Updated on Mar 24 2026 7:00 AM

నేలకొండపల్లి: భద్రాచలం దేవస్థానం నిర్మాత, భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(భక్తరామదాసు) జన్మస్థలమైన నేలకొండపల్లిలో శ్రీ రామనవమి వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈమేరకు రామదాసు ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం స్థానిక మహిళలు పసుపు దంచడంతో పాటు ముత్యాల తలంబ్రాలు కలిపారు. అనంతరం గండికోట వెంకటలక్ష్మి ఆధ్వర్యాన రామదాసు కీర్తనలు ఆలపించారు. సర్పంచ్‌ శీలం వెంకటలక్ష్మితో పాటు పెండ్యాల శ్రీమతి, జక్కేపల్లి ఉష, లక్ష్మి, రాయపూడి ఉష, మల్లికాంబ, పూజారి సౌమిత్రి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

‘భూదాన్‌’ కేసులో మరో నలుగురి అరెస్ట్‌

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్‌, ప్రభుత్వ భూమిలో ప్లాట్లు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసిన కేసులో మరో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం అర్బన్‌ స్టేషన్‌లో సీఐ భానుప్రకాశ్‌తో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితులైన పోలెబోయిన ముత్తయ్య, బల్లి శ్రీనివాస్‌, కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలంను రిమాండ్‌కు తరలించగా, మెజిస్ట్రేట్‌ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాక తిరిగి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు వారి అక్రమ ఆస్తులను చట్టప్రకారం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా

ఖమ్మం లీగల్‌/మధిర: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ప్రియ సోమవారం తీర్పు చెప్పారు. తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన తూము వీరభద్రరావు వద్ద మధిర టీచర్స్‌ కాలనీకి చెందిన ఎండీ.ముస్తఫా 2018 ఆగస్టు, సెప్టెంబర్‌లో రూ.10లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2020 సెప్టెంబర్‌లో రూ.14.50 లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో వీరభద్రరావు తన న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ ద్వారా లీగల్‌ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం ముస్తఫాపై నేరం రుజువు కావడంతో 18నెలల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.14.50లక్షల పరిహారం చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.

దాతలు స్పందిస్తేనే జీవితం

తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంకు చెందిన ఇస్నేపల్లి మహేష్‌(24) మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ముత్తగూడెం వద్ద కుక్క అడ్డు రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా కింద పడడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. దీంతో మహేష్‌కు ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే, ఆయనకు తండ్రి లేకపోవడం, తల్లి యశోదది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి కావడంతో చికిత్సకు సమస్య ఎదురవుతోంది. ఈమేరకు దాతలు ఆర్థికంగా ఆదుకుని తన కుమారుడి ప్రాణాలు కాపాడాలని ఆమె వేడుకుంటోంది. సాయం చేయాలనుకునేవారు 98660 29654, 99084 60315 నంబర్లకు ఫోన్‌ పే లేదా గూగుల్‌ పే చేసి ఆదుకోవాలని యశోద ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు..

కొణిజర్ల: తల్లి మరణించిందనే బాధతో ఉన్న విద్యార్థికి బంధువులు నచ్చచెప్పి పదో తరగతి పరీక్ష రాయించగా.. ఆతర్వాత తలకొరివి పెట్టి బాధ్యత తీర్చుకున్నాడు. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన పాలెపు ఉమ(36) అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు రాంచరణ్‌, నవదీప్‌ ఉన్నారు. నవదీప్‌ స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ సెయింట్‌ అలోషియస్‌ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు. ఈక్రమాన సోమవారం పరీక్షకు సిద్ధమవుతుండగానే ఆయన తల్లి మృతి చెందింది. విద్యార్థి భవిష్యత్‌ దృష్ట్యా బంధువులు నచ్చచెప్పడంతో దుఃఖాన్ని దిగమింగుకుని కన్నీటితో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ముగిశాక తల్లికి తలకొరివి పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement