● తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి
వైరా: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యమని బ్యాంక్ చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు. వైరా బ్రాహ్మణపల్లిలో బ్యాంకు నూతన బ్రాంచ్‌ను రీజినల్ మేనేజర్ ప్రసన్నకుమార్‌తో కలిసి శుక్రవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.5కోట్ల రుణాల చెక్కులు అందజేశాక మాట్లాడారు. రాష్ట్రంలో 933 శాఖలు, రూ.80వేల కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు కొనసాగుతోందని తెలిపారు. మహిళలు, రైతులు, చిరువ్యాపారులతో పాటు పారిశ్రామికవేత్తలకు రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ పి.సూరిరెడ్డి, సీనియర్ మేనేజర్ ప్రకాశ్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, హబ్ మేనేజర్ సంపత్ పాల్గొన్నారు.
‘భూదాన్’ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు
ఖమ్మంమయూరిసెంటర్: భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేశాక అర్హులకు ప్రభుత్వం స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. వీరు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు రుణాల మంజూరు చేయించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణ ప్రారంభ ఖర్చు కోసం డీసీసీబీ ద్వారా రూ.లక్ష రుణంగా ఇప్పిస్తారు. ఈమేరకు లబ్ధిదారుల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు మెప్మా అధికారులు డీసీసీబీ ద్వారా రుణం మంజూరు చేయించనున్నారు. ఎవరైనా మహిళలు సంఘంలో సభ్యులుగా లేకపోతే వారితో సంఘాలను ఏర్పాటు చేయించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు 31మంది మహిళలు సంఘంగా ఏర్పడేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
మూడోసారి కూడా వాయిదా
కామేపల్లి: కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణప్రసాద్ సంత వేలం పాట మూడోసారి కూడా వాయిదా పడింది. మొదటి సారి పోలీసుల సూచనతో, రెండోసారి మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడిన విషయం విదితమే. ఈమేరకు శుక్రవారం సర్పంచ్ ధరావత్ అనురాధ అధ్యక్షతన వేలం నిర్వహించగా బోడా శ్రీను, ధరావత్ విన్నిబాబు, గుగులోత్ వినోద్‌కుమార్, బాదావత్ నాగరాజు ధరావత్తు, సాల్వెన్సీ సొమ్ము రూ.35లక్షల చొప్పున చెల్లించి పాల్గొన్నారు. చివరికి బోడా శ్రీను రూ.1,82,80,000 హెచ్చు పాటదారుడిగా నిలిచినా ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో వాయిదా వేశారు. కాగా, మద్దతు ధర తగ్గిస్తేనే పాల్గొంటానని నాగరాజు మధ్యలోనే తప్పుకున్నాడు. కల్లూరు డీఎల్‌పీఓ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ మేకల మల్లికార్జున్‌రావు, ఎంపీఓ వీ.వీ.శాసీ్త్ర, కార్యదర్శులు శంకర్, నెహ్రూ పాల్గొన్నారు.


