మే నెలలో
ప్రాథమిక సర్వే
మే నెలలో ఇళ్ల జాబితా, బ్లాక్‌ల గుర్తింపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తిస్థాయి జనగణన ఇప్పటికే అధికారులకు మూడు రోజుల శిక్షణ పూర్తి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జనగణన కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కేంద్రప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఈ ఏడాది మే నెలలో ఇళ్ల గుర్తింపు, జనాభా గణన బ్లాక్‌లను గుర్తించనున్నారు. ఇందుకోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నియమితులైన అధికారులకు ఈనెల 15 నుంచి 17 వరకు కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈసారి జనగణన మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో చేపడతారు.
నియామకాలు పూర్తి
జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జనగణన కోసం అధికారుల కసరత్తు వేగిరమైంది. జిల్లా నుంచి మండల స్థాయి వరకు అధికారుల నియామకాలను పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి అదనపు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, డీఆర్‌ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే, జెడ్పీ సీఈఓ, సీపీఓ, డీఈఓ, డీపీఓ, డీఐఓ, స్టాటిస్టికల్ ఆఫీసర్, ప్రణాళిక శాఖ ఏడీలు అదనపు జిల్లా సెన్సెస్ అధికారులుగా ఉంటారు. మరోవైపు సబ్ డివిజన్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, మండల స్థాయిలో అధికారులకు బాధ్యతలను అప్పగించారు.
మూడు రోజుల శిక్షణ
జనగణన లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా జరిగేలా ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు గణన అధికారులకు కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్లు, మేనేజర్లకు జనగణన విభాగం డైరెక్టరేట్‌కు చెందిన సంయుక్త సంచాలకులు శ్రీకాంత్, మాస్టర్ ట్రెయినర్ రవికుమార్ శిక్షణను ఇచ్చారు. ఇంటి జాబితా, ఎన్యుమరేషన్ బ్లాక్‌ల ఎంపికతోపాటు వచ్చే ఏడాది జరిగే జనగణన పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. వీరు మండల స్థాయిలో అధికారులకు ఈనెల 28, 29, 30వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి..
ఈ ఏడాది మే నెలలో ప్రాథమిక సర్వే చేపట్టనుండగా.. పూర్తి స్థాయి జనగణన 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. తొలిసారి డిజిటల్ విధానంలో గణన చేపడుతున్నందున ప్రజలు వెబ్ ఆధారంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇక జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వం పథకాల రూప కల్పన, అమలుకు జనగణన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. తొలిసారి డిజిటల్ విధానంలో గణన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు వెబ్ ఆధారంగా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశముంది. మొదటి దశలో ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ఈ ఏడాది మే 11నుంచి జూన్ 9వరకు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో దశ జన గణన ఉంటుంది. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్
ప్రధాన జనగణన ఇబ్బంది లేకుండా చేపట్టాలనే ఉద్దేశంతో అధికారులు ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు సర్వే చేపడతారు. తొలుత ఒక ప్రాంతంలో నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను సేకరించడమే కాక వాటికి నంబర్లు కేటాయించి జాబితా రూపొందించారు. అలాగే, ఎన్యుమరేషన్ బ్లాక్(జనాభా గణన బ్లాక్‌లు)లు కూడా ఏర్పాటవుతాయి. ఆపై జనగణనను సులువుగా చేపట్టేలా పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్న ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతీ బ్లాక్‌కు కేటాయించే అధికారి వారి పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారు. ఏ ఇల్లు కానీ, వ్యక్తిని కానీ వదిలేయకుండా వివరాలు క్రమపద్ధతిలో సేకరించేలా ఇళ్ల జాబితా, జనాభా గణన బ్లాక్‌లను రూపొందిస్తారు. దీన్ని జన గణనలో ప్రాథమిక దశగా వ్యవహరిస్తారు.
జనగణనకు యంత్రాంగం కసరత్తు


