● జిల్లాలో కొనసాగుతున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ● ఎనిమిది సెంటర్లలో బాలికలకు టీకాలు ● ఇప్పటి వరకు 2,230 మందికి పూర్తి
ఖమ్మంవైద్యవిభాగం: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతనెల 28వ హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఆపై ఈనెల 8వ తేదీన ఖమ్మం పెద్దాస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ దుదిశెట్టి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా జిల్లాలో అందుబాటులోకి వచ్చినట్లయింది. జిల్లావ్యాప్తంగా 14 ఏళ్లు పూర్తయి 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు ఈ టీకా వేయనున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, మధిర, వైరా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వ సెలవులు మినహా ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాలికలకు టీకా వేస్తుండగా, ఇప్పటివరకు 2,230 మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు.
దశల వారీగా విస్తరణ
హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం జిల్లాలో మూడు నెలల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం ఎనిమిది కేంద్రాల్లో టీకా వేస్తుండగా, త్వరలోనే 24 గంటలు నడిచే బనిగండ్లపాడు, చింతకాని, ఏన్కూరు, సింగరేణి ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా పీహెచ్‌సీల్లో కూడా టీకాను అందుబాటులోకి తీసుకొస్తారు.
ఇన్‌ఫెక్షన్లతో కేన్సర్
జిల్లాలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గార్డాసిల్–4 అనే టీకా వేయనుండగా, ఇది బాలికల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌ను అరికడుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వయస్సు బాలికల్లో హర్మోన్ల మార్పుల కారణంగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయని, సరైన చికిత్స తీసుకోకపోతే గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు కేన్సర్‌ను అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన బాలికలు సుమారు 15వేల మందికి పైగా ఉంటారనే అంచనాకు వచ్చారు. వీరందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 2,230మంది బాలికలకు వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు. సెంటర్లలో సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున, అపోహలు విడనాడి టీకా వేయించుకుని సర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు.


