వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం

Mar 24 2026 8:05 AM | Updated on Mar 24 2026 8:05 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీవారిని పెళ్లి కుమారుడిగా, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించడంతో పాటు స్నాతకం, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి తరఫున పెళ్లి పెద్దలుగా ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్‌శర్మ, అమ్మవార్ల తరఫున వేద పండితులు, అర్చకులు మారుతీ రఘురామకృష్ణ, మారుతి వెంకటరమణ వ్యవహరించారు. ఈ సందర్భంగా గోత్ర ప్రవరలు, గుణగణాలను వర్ణిస్తూ ఇరువర్గాల సంవాదం ఉత్సాహంగా సాగింది. ఆలయ ఈఓ జగన్‌మోహన్‌రావు, సూపరింటెండెంట్‌ సోమయ్య, అర్చకులు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ పరీక్ష విధుల

నుంచి ముగ్గురి తొలగింపు

ఖమ్మం సహకారనగర్‌: పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిని తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ తెలిపారు. బోనకల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇన్విజిలేటర్‌ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో రిలీవ్‌ చేయడమే కాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్ల డించారు. అంతేకాక సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను సైతం విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కాగా, సోమవారం జరిగిన పరీక్షకు 16,936మంది విద్యార్థుల్లో 16,918మంది హాజరు కాగా 18మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలోని పలు కేంద్రాలను తనతో పాటు అసిస్టెంట్‌ కమిషనర్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయని డీఈఓ తెలిపారు.

రైతులకు పెట్టుబడి సాయం

3.35లక్షల మంది ఖాతాల్లో

రూ.169.35 కోట్లు

ఖమ్మంవ్యవసాయం: రైతు భరోసా పథకం కింద రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన పెట్టుబడి సాయం తొలి విడత నిధులు సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుత యాసంగి కాలానికి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో ఎకరం విస్తీర్ణం వరకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. జిల్లాలో మొదటి విడతగా 3,35,062 మంది రైతులు అర్హత సాధించారు. వీరి ఖాతాల్లో రూ.169.35 కోట్లు జమ కాగా, మిగతా వారికి విడతల వారీగా జమ అవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.

బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా శ్రీనివాసరావు

ఖమ్మం లీగల్‌: తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, సోమవారం చేపట్టిన లెక్కింపులో ఆయన విజయానికి అవసరమైన 1,085 ఓట్లు సాధించినట్లు తేలింది. దీంతో శ్రీనివాసరావు విజయాన్ని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఈమేరకు పలువురు న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement