ముందస్తు ప్రణాళికతో సిద్ధం..
గుర్తించిన గ్రామాలివే..
● 18 గ్రామాల్లో సమస్య తలెత్తనున్నట్లు గుర్తింపు ● ఆయా గ్రామాల్లో భూగర్భ జలం అడుగంటుతున్నట్లు నిర్ధారణ ● ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమైన అధికారులు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గుతూ ఉండటంతో కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని 18 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించి, అక్కడ వివిధ మార్గాల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు ప్రారంభించారు. హ్యాబిటేషన్లలో ఉన్న బోర్లు, నీటి వనరులు సరిపోని గ్రామాల్లో ప్రైవేట్ వనరులు, దాతల సహకారం ద్వారా లేదా అద్దెకు నీటి వనరులు తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, సాధ్యం కాకపోతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలో 915 హ్యాబిటేషన్లు..
జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 915 హ్యాబిటేషన్లు ఉండగా, వాటిలో 911 హ్యాబిటేషన్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అవుతోంది. ఎప్పుడైనా సరఫరాలో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయంగా నీటి వనరులను సిద్ధం చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ నీటి వనరులు అద్దెకు తీసుకోవడం, దాతల సహకారం పొందడం లేదా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం లాంటి ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని నాలుగు మండలాల్లో ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. వేసవిలో నీటి కొరత ఎక్కువయ్యే అవకాశం ఉన్న గ్రామాలుగా ముదిగొండ మండలంలోని బాణాపురం, ముదిగొండ, చింతకాని మండలంలోని నేరడ, పందిళ్లపల్లి, తల్లాడ మండలంలోని కురన్నవల్లి గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గత నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని హ్యాబిటేషన్లలో తాగునీటి పథకాల పరిస్థితిని పరిశీలించారు. చేతి పంపులు, పంపుసెట్లలో కొన్ని మరమ్మతులు అవసరమని, ఇంకొన్ని లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు. మరమ్మతులు పూర్తి చేయడానికి సుమారు రూ.90 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక అందించారు.
22 వరకు జల మహోత్సవం
ఈ నెల 8న గ్రామ పంచాయతీల్లో మొదలైన ‘జల మహోత్సవం’22వ తేదీ వరకు కొనసాగనుంది. మహిళా సర్పంచులు ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే, తాగునీటి సమస్య తలెత్తితే తెలుసుకుని టోల్ ఫ్రీ నంబర్ 1916ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నంబర్‌కు అందిన సమస్యలు పరిష్కరించడమే కాక ఫిర్యాదు చేసిన వారికి సమాచారం అందజేస్తామని చెబుతున్నారు.
వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇప్పటికే తాగునీటి పథకాలను పరిశీలించి ఎక్కడ ఏమేం చేయాలో నివేదికను డీపీఓ ద్వారా ఆయా గ్రామపంచాయతీలకు అందజేశాం. నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉన్న 18 గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాం. నీటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ట్రోల్‌ఫీ నంబర్ 1961ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
–పుష్పలత, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ
ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం అధికారులు గుర్తించిన గ్రామాల్లో కూసుమంచి మండలంలోని గంగాబండతండా పంచాయతీ (బోటిమీదితండా, గంగాబండ తండా), తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట, ఖమ్మంరూరల్ మండలంలోని గొల్లపాడు, పోలిశెట్టిగూడెం, ఏన్కూరు మండలంలోని కేసుపల్లి, కామేపల్లి మండలంలోని టేకులతండా, కల్లూరు మండలంలోని ఎర్రబోయినపల్లి, పేరువంచ, అంబేడ్కర్‌నగర్‌లో నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశముందని గుర్తించారు. అలాగే, జాబితాలో వేంసూరు మండలంలోని అమ్మపాలెం, వేంసూర్, భరణిపాడు, పెనుబల్లి మండలంలోని లింగగూడెం, తల్లాడ మండలంలోని కుర్నవల్లి, మల్లారం, సత్తుపల్లి మండలంలోని రేజర్ల, కిస్టారం గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


