● ఖమ్మంలో సముద్ర చేపల విక్రయం ● బరువు 60కేజీలు.. కిలో ధర రూ.600 నుంచి మొదలు ● కొనుగోళ్లకు నగరవాసుల ఆసక్తి
ఖమ్మంవ్యవసాయం: సముద్రంలో మాత్రమే లభించే భారీ చేపలను జిల్లా కేంద్రంలో అమ్మకానికి తీసుకొచ్చారు. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన కొందరు యువకులు బృందంగా ఏర్పడి ఏపీలోని విశాఖపట్నంలో కొనుగోలు చేసిన ఈ చేపలను ఇక్కడ అమ్ముతున్నారు. వైట్ టూనా, బ్లూ టూనా తదితర రకాల చేపలు 60నుంచి 80 కిలోల వరకు బరువు ఉన్నాయి. వీటిని ముక్కలుగా చేసి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు విక్రయించారు. ఇవి అరుదుగా మాత్రమే లభించే చేపలు కావడం, రుచి కూడా బాగుంటుందనే భావనతో పలువురు కొనుగోలు చేశారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ సమీపాన మంగళవారం అడ్డా ఏర్పాటుచేసుకున్న యువకులు.. చేపల తల, రెక్కలను తొలగించి చేప చర్మం తీసి ముక్కలుగా చేస్తూ విక్రయించారు. ఇక ఈ చేపల మాంసంతో తయారుచేసిన పచ్చళ్లను కిలో రూ.వేయి చొప్పున అమ్మకానికి పెట్టారు. కాగా, ఉమ్మడి జిల్లాలో సముద్రపు చేపలకు డిమాండ్ ఉంటుందనే భావనతో 40 మంది కలిసి కొద్ది రోజులుగా విశాఖ నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నామని పాల్వంచకు చెందిన కాకటి వినోజ్ తెలిపారు. ఇటీవల పాల్వంచ, మణుగూరులో విక్రయించగా మంచి ఆదరణ లభించిందని, ఖమ్మం వాసులు కూడా ఆసక్తిగా కొనుగోలు చేశారని వెల్లడించారు.


