కారేపల్లి: డోర్నకల్– భద్రచాలం రోడ్ మార్గంలో రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి భూసేకరణపై చర్యలు కొలిక్కి రాలేదు. కారేపల్లి మండలం సింగరేణికి చెందిన నిర్వాసితులతో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూమి ఎకరానికి రూ.91లక్షలు, ఇంటి స్థలమైతే గజానికి రూ.20వేలు చెల్లించాలని బాధితులు కోరారు. కానీ అధికారులు మాత్రం వ్యవసాయ భూమి ఎకరానికి రూ.18లక్షలు, ఇంటి స్థలానికి గజానికి రూ.6,300 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇల్లు కలిగిన మునీర్ అనే వ్యక్తికి ఆర్ అండ్ బీ అధికారుల సూచనలతో అదనపు పరిహారం కలిపి రూ.46లక్షలు వస్తాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూసేకరణకు నిర్ణయించిన ధర ప్రకారమే పరిహారం చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేయగా నిర్వాసితులు అంగీకరించలేదు. మైదాన ప్రాంతంలోని భూముల ధరలను పరిగణనలోకి తీసుకొని మానవతాదృక్పథంతో న్యాయం చేయాలని కోరగా, మరోమారు సమావేశం ఏర్పాటు చేసే సమావేశం నాటికి ఆలోచించుకొని నిర్ణయం తెలపాలని అధికారులు సూచించారు. అనంతరం సింగరేణి సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్ ఆధ్వర్యాన నిర్వాసితులు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రమేష్, రైల్వే జేఈ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులు కోరినంత ఇవ్వలేమన్న అధికారులు


