‘ముఖ’ సాక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘ముఖ’ సాక్ష్యం

Mar 18 2026 7:45 AM | Updated on Mar 18 2026 7:45 AM

● ఉపాధి హామీలో ఫేస్‌ అటెండెన్స్‌ ● రెండేసి సార్లు కూలీల హాజరు నమోదు ● గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్యలు

● ఉపాధి హామీలో ఫేస్‌ అటెండెన్స్‌ ● రెండేసి సార్లు కూలీల హాజరు నమోదు ● గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్యలు

ఖమ్మం మయూరిసెంటర్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మస్టర్లలో అక్రమాలకు తావులేకుండా, అర్హులైన కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా కేంద్రప్రభుత్వం ‘ఫేస్‌ రికగ్నైజ్డ్‌ సిస్టమ్‌’ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. కూలీల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా నమోదు చేయనుండగా, రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. గత నెల నుంచి ఇక్కడ మొదలైన ఈ విధానాన్ని తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో పని ప్రదేశాల్లో ఉన్న కూలీలకే హాజరు నమోదుకానుంది.

గతనెల 9నుంచి..

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెలలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పైలట్‌ ప్రాజెక్టుగా ప్రతీ రాష్ట్రం నుండి ఒక జిల్లాను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాకు స్థానం దక్కగా, 92.65 శాతం మంది క్రియాశీలక కూలీలు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవడంతో గతనెల 9 నుండి ప్రయోగాత్మకంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ విధానం అమలును పరిశీలించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇటీవల మొదలుపెట్టారు.

స్కాన్‌ చేయాల్సిందే..

గతంలో పనిప్రదేశాల్లో కూలీలను బృందంగా ఫొటో తీసి ఎన్‌ఎంఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసేవారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంతో ప్రతి కూలీ ముఖాన్ని ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారికే హాజరు నమోదై వేతనం అందనుంది. అలాగే, ఒకరి పేరిట మరొకరు హాజరు వేయించుకునే విధానానికి అడ్డుకట్ట పడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పని ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆన్‌లైన్‌ హాజరు వేయాల్సి ఉండడం భారంగా మారుతోంది. చాలాచోట్ల సర్వర్‌ డౌన్‌ కావడం, నెట్‌వర్క్‌ సమస్యల వల్ల కూలీల హాజరు నమోదులో ఆలస్యం, ఒక పూట హాజరు పడకపోయినా ఆ రోజు వేతనం కోల్పోవాల్సి ఉండడంతో కూలీలు పనికి రావడానికి నిరాసక్తత కనబరుస్తున్నారు.

సమస్యలు అధిగమించేలా...

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సమస్య హాజరు నమోదుకు అవరోధంగా మారుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగాకీలక వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిసింది. పని ప్రదేశంలో కూలీల ఫొటోలు తీసుకుని, సిగ్నల్‌ ఉన్న చోటుకు వెళ్లాక డేటా అప్‌లోడ్‌ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే, రెండు సార్లు కూలీ ముఖాన్ని ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉండగా.. రెండింటి మధ్య నాలుగు గంటలు సమయం వ్యత్యాసం ఉండాలనే నిబంధన విధించారు. అయితే, కూలీలు హాజరు పెరిగితే సిగ్నల్‌ లేని ప్రాంతాల్లో ఇలా రెండు సార్లు దూరం వెళ్లి నమోదు చేసి రావడానికి ఇబ్బందులు తప్పవని సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement