వాతావరణానికి అనుకూలంగా పంటల సాగు | - | Sakshi
Sakshi News home page

వాతావరణానికి అనుకూలంగా పంటల సాగు

Mar 18 2026 7:45 AM | Updated on Mar 18 2026 7:45 AM

వైరా: రైతులు వాతావరణ మార్పులను గమనిస్తూ అందుకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ విస్తరణ అధికారి యాకాద్రి తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళాను అశ్వారావుపేటలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం యాకాద్రి మాట్లాడుతూ రైతులు కంది, పెసర, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేయడంతో పాటు ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించాలన్నారు. అనంతరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, అధికారులు, శాస్త్రవేత్తలు డాక్టర్‌ దేవి, ప్రశాంతి, ఫణిశ్రీ, చైతన్య, పావని, యాదగిరి, మధుసూదన్‌, కరుణశ్రీ పాల్గొన్నారు.

25లోగా హార్డ్‌కాపీలు సమర్పించాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: 2025–26 సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కోసం నిరుద్యోగ ఎస్సీ యువత ఈనెల 24లోగా https://tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నవీన్‌బాబు సూచించారు. ఆపై దరఖాస్తు హార్డ్‌కాపీకి ధృవ పత్రాలను జతచేసి 25వ తేదీలోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు పథకాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోందని వెల్లడించారు. ఈమేరకు అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రిటైనింగ్‌ వాల్‌లో

నాణ్యత తనిఖీలు

ఖమ్మంఅర్బన్‌: మున్నేటికీ ఇరువైపులా ఖమ్మం, ఖమ్మం రూరల్‌ మండలాల్లో రూ.690 కోట్ల వ్యయంతో చేపడుతున్న రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను నాణ్యత నియంత్రణ అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ బుచ్చిరెడ్డి, ఈఈ వెంకటరమణ, డీఈ చంద్రమోహన్‌తో పాటు జలవనరుల శాఖ ఖమ్మం ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈ ఉదయ్‌ప్రతాప్‌, ఏఈ రామకృష్ణ తదితరులు పనులపై ఆరా తీశారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణంలో నాణ్యత ను తనిఖీ చేయడమే కాక ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించి సూచనలు చేశారు.

పీఎంఎఫ్‌బీవైతో

రైతులకు భరోసా

ఖమ్మంమయూరిసెంటర్‌: పంట నష్టాల సమయాన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ద్వారా నాలుగేళ్లలో భారీ స్థాయిలో క్లెయిమ్‌లు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల సహాయ మంత్రి భగీరథ్‌చౌదరి ఈమేరకు సమాధానం ఇచ్చారు. 2021–22 నుంచి 2024–25 (2025 డిసెంబర్‌ 31 వరకు) కాలంలో రైతులకు బీమా కంపెనీలు రూ.75,450.58 కోట్ల క్లెయిమ్‌లు చెల్లించాయని వెల్లడించారు. పీఎంఎఫ్‌బీవై అమలులో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ రంగ బీమా సంస్థలు కూడా భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. తద్వారా రైతులకు పంట నష్టాల సమయాన అండగా నిలుస్తూ, ఆర్థిక సాయం అందుతోందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement