ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. 52 రోజులకు గానూ రూ.22,63,330 ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ పరిశీలకులు రెంటాల సమత, ఆలయ ఈఓ కె. జగన్మోహన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్ : స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 24వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయేతర పథకాలకు 21 – 50 సంవత్సరాలు, వ్యవసాయ పథకాలకు 21 – 60 సంవత్సరాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి 18 – 45 సంవత్సరాలు, వేతన ఉపాధి కార్యక్రమాలకు 18 – 35 సంవత్సరాల వారు అర్హులని వివరించారు. గత ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందిన కుటుంబాల వారు అనర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులైతే సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ జత చేయాలని తెలిపారు. దరఖాస్తులను https:// tgobmms.cgg.gov.in ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.
పశువులకు ‘గాలికుంటు’ టీకాలు వేయించాలి
కామేపల్లి : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ పురంధర్ రైతులకు సూచించారు. మండలంలోని ఊట్కూరులో సోమవారం ఆయన టీకాల పంపిణీ శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఆవులు 93,420, గేదెలు 3,13,713 ఉన్నాయని, ఏప్రిల్ 9వ తేదీ లోగా ఉచితంగా టీకాలు వేయనున్నామని తెలిపారు. 2030 నాటికి వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం జాతీయ జంతువ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. టీకా వేసిన తర్వాత పశువులకు సరైన పోషకాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి.నాగులు, సిబ్బంది రాంబాబు, శిరీష, వంశీ, శరత్, జానీ పాల్గొన్నారు.
బొగ్గు రవాణా లక్ష్యం సాధించాలి
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో నిర్దేశించిన బొగ్గు రవాణా లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం ఆయన సత్తుపల్లి జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి జేవీఆర్ ఓసీ సీహెచ్‌పీలోని కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్, మొబైల్ క్రషర్ యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం బొల్లం శ్రీనివాస్, జేవీఆర్, కిష్టారం ఓసీల పీఓలు ప్రహ్లాద్, సునీల్ వర్మ, కె.సోమశేఖర్‌రావు, ఎస్‌ఓఎం బి.రాజేశ్వరరావు, జి.కల్యాణ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.


