పేదల ఆత్మగౌరవానికి మాది పూచీ | - | Sakshi
Sakshi News home page

పేదల ఆత్మగౌరవానికి మాది పూచీ

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● వెలుగుమట్లలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● వెలుగుమట్లలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా తమ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన విషయం విదితమే. ఈమేరకు ఇందిరమ్మ కాలనీగా ఇళ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గతంలో కొందరు పేదల సంఘం ముసుగులో నకిలీ పట్టాలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని విమర్శించారు. ఒకే స్థలాన్ని పలువురికి అమ్ముతూ పేదలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారని తెలిపారు. నీళ్లు, విద్యుత్‌, రోడ్లు లేని ప్రాంతంలో పేదలు ఇబ్బంది పడొద్దనే భావనతో తమ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తోందని వెల్లడించారు. వెలుగుమట్ల కాలనీని తెలంగాణలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల ఏర్పాటుచేసి డిసెంబర్‌ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తుమ్మల వెల్లడించారు. ఈమేరకు నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కాగా, పేదలను మోసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సీపీ సునీల్‌దత్‌, రాష్ట్ర విత్తన గిడ్డంగి కార్కొపరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, తహసీల్దార్‌ సైదులు, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, తుపాకుల యలగొండస్వామి, రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement