హాస్టళ్లకు ‘గ్యాస్‌’ సెగ | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లకు ‘గ్యాస్‌’ సెగ

Mar 12 2026 7:40 AM | Updated on Mar 12 2026 7:40 AM

● పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సరఫరాపై నీలినీడలు ● జిల్లాలో అప్రమత్తమైన అధికారులు ● రంగంలోకి అదనపు కలెక్టర్‌.. ● సక్రమంగా పంపిణీ చేయాలని ఏజెన్సీలకు సూచన

అవసరమైన మేరకు ఏర్పాటు చేస్తాం

● పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సరఫరాపై నీలినీడలు ● జిల్లాలో అప్రమత్తమైన అధికారులు ● రంగంలోకి అదనపు కలెక్టర్‌.. ● సక్రమంగా పంపిణీ చేయాలని ఏజెన్సీలకు సూచన

ఖమ్మంమయూరిసెంటర్‌ : పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలు జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల వంటగదుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు, గ్యాస్‌ ఉత్పత్తిపై పడుతున్న ప్రభావం కారణంగా స్థానికంగా గ్యాస్‌ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని సాకుగా చూపుతూ గ్యాస్‌ ఏజెన్సీలు వసతిగృహాలకు సరఫరాను చేయలేమని చెబుతుండగా, వేలాది మంది విద్యార్థుల భోజన తయారీకి విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని హాస్టల్‌ వెల్ఫేర్‌, డీడబ్ల్యూఓ విభాగాల వారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అదనపు కలెక్టర్‌ అప్రమత్తమై గ్యాస్‌ ఏజెన్సీలకు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.

నిబంధనల మెలిక..

గత రెండు రోజులుగా జిల్లాలోని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు సంక్షేమ అధికారులకు షాకిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత కోటా మేరకే గ్యాస్‌ సరఫరా చేస్తాం.. అంతకు మించి అదనపు సిలిండర్లు ఇవ్వలేం’ అని ఖరాకండిగా చెప్పారు. యుద్ధ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, ప్రాధాన్యత క్రమంలోనే సిలిండర్లు ఇస్తామని చెప్పడంతో వసతిగృహాల సంక్షేమ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఈ నిబంధనల విషయాన్ని జిల్లా అధికారులకు వివరించారు.

విద్యార్థుల భవితవ్యంపై ఆందోళన..

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలతో పాటు సంక్షేమ గురుకులాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో వసతిగృహంలో వందలాది మంది విద్యార్థులు ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు. గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే కట్టెల పొయ్యిలపై వంట చేయడం అసాధ్యమని, దీంతో పిల్లలకు సకాలంలో భోజనం అందక ఇబ్బందులు పడతారని సంక్షేమ అధికారులు, వార్డెన్లు ఆందోళన చెందారు.

అదనపు కలెక్టర్‌ జోక్యంతో..

సమస్య తీవ్రతను గమనించిన జిల్లా సంక్షేమ అధికారులు వెంటనే అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులకు సూచనలు చేసినట్లు తెలిసింది. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా నిరంతరాయంగా గ్యాస్‌ సరఫరా చేయాలని, ఎక్కడా వంటలు ఆగిపోకుండా తగినన్ని సిలిండర్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి గ్యాస్‌ సరఫరాకు మార్గం సుగమమైంది. అయితే నిబంధనల ప్రకారం రికార్డులు సక్రమంగా ఉండాలని ఏజెన్సీలు కోరడంతో సంక్షేమాధికారుల నుంచి ప్రత్యేక అభ్యర్థన లేఖలను ఏజెన్సీలు సేకరిస్తున్నాయి.

జిల్లాలోని హాస్టళ్లు, గురుకులాల్లో నెల వారీ సిలిండర్ల వినియోగం ఇలా..(ఒక్కో దానిలో)

ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు 10 నుంచి 15

పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు 20 నుంచి 25

సంక్షేమ గురుకులాలు 30కి పైగా

వసతిగృహాల్లో అవసరం మేరకు గ్యాస్‌ సిలిండర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఏజెన్సీలకు సూచించారు. వసతిగృహాలకు గ్యాస్‌ సరఫరా గతంలోలాగే జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.

– జి.జ్యోతి, డీబీసీడీఓ, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement