అతిథుల సంరక్షణ అందరి బాధ్యత
ఖమ్మంరూరల్: మండలంలోని చింతపల్లికి రెండు రోజుల క్రితం వలస వచ్చిన సైబీరియా కొంగలను అతిథుల్లా భావించి వాటి రక్షణ బాధ్యతను తీసుకోవాలని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ సూచించారు. ఎఫ్‌డీఓ కృష్ణప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో కలిసి చింతపల్లిలో గురువారం ఆయన పర్యటించారు. సైబీరియా కొంగల ఆవాసాలు, ఆహార లభ్యతపై ఆరాతీశాక డీఎఫ్‌ఓ మాట్లాడారు. చింతచెట్లు, సర్కారీ తుమ్మ చెట్లు, వాటర్ ట్యాంక్ పరిసరాల్లో గూళ్లు ఏర్పర్చుకున్నాయని తెలిపారు. ఎవరు కూడా వీటిని భయపెట్టేలా రాళ్లు విసరొద్దని, గూడు పెట్టుకున్న చెట్ల కొమ్మలు నరకొద్దని సూచించారు. పక్షుల గుడ్లు కింద పడినా, గాయపడిన పక్షులు కనిపించినా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కాగా, చింతపల్లి చెరువు అభివృద్ధికి అటవీ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, ఈ ప్రాంతాన్ని కొంగలకు సహజ ఆవాసంగా మార్చేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాక కోతుల బెడద నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జిల్లా అటవీ శాఖాధికారి
సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్


